Idream media
Idream media
సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ శ్రేణులు ప్రవర్తిస్తున్న తీరును బట్టి చెప్పవచ్చు. ముఖ్యమంగా టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడదూకుతారో అన్న ఆందోళనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, శ్రేణులు ఉంటున్నాయి. ఎక్కడ, ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారో అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల కథలికలపై నిఘా పెట్టిన చంద్రబాబు వారిని ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. నిత్యం వారితో టచ్‌లో ఉంటూ భవిష్యత్‌పై భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ తరఫున చంద్రబాబుతో సహా 23 మంది గెలిచారు. ఇందులో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వైసీపీలో చేరకపోయినా అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా వారు అటు అధికార పార్టీ ఇటు తాము గెలిచిన ప్రతిపక్షపార్టీతో కాకుండా వేరుగా కూర్చుంటున్నారు. పార్టీని వీడిని ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్ధాళి గిరితోపాటు అధికార పార్టీ నేతలు కూడా టీడీపీ నుంచి బయటకు రాబోవు ఎమ్మెల్యేల సంఖ్యను తరచూ చెబుతూ టీడీపీ అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత నెలాఖరులో జరిగిన మహానాడుకు ఒక్క రోజు ముందు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత బాబు వారితో మంతనాలు జరపడంతో ఆ చర్చకు తాత్కాలికంగా తెరపడింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమైంది. సాధారణంగా పార్టీ ఏదైనా ఎమ్మెల్యేలు తమ పరిచయాల కొద్దీ ఒకరునొకరు కలుసుకోవడం, మాట్లాడుకోవడం సర్వసాధారణం. గత శాసన సభ సమావేశాల్లోనూ మండలిలో సీఆర్‌డీఏ, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు మండలిలో ఆమోదానికి వెళ్లిన సమయంలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు సెల్ఫీలు కూడా దిగారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలను కలిసారంటే రాజకీయ వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది.
తాజాగా ఈ రోజు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక అసలు లక్ష్యం ఏమైనా.. ఇరు పార్టీల్లో ఒకింత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. టీడీపీ తాజా, మాజీ ప్రజాప్రతినిధుల అరెస్ట్‌లతో పరిస్థితి వాడీవేడీగా ఉంది. ఇలాంటి సమయంలో పయ్యావుల కేశవ్.. మంత్రి కొడాలి నానిని కలవడంతో సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ మారతారా..? లేదా..? అనే అంశంతో సంబంధం లేకుండా వీరి కలయిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరువురు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. పైగా ఒకే సామాజికవర్గం. గత ఎన్నికలకు ముందు పయ్యావుల కేశవ్ వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. నిన్న నారా లోకేష్ అనంతపురం పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా పయ్యావుల హాజరు కాలేదు. ఏమో.. గుర్రం ఎగరావచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.