Idream media
Idream media
ప్రజాస్వామ్య మనుగడకు ప్రధానమైన న్యాయవ్యవస్థ విశ్వసనీయతను తెలుగుదేశం పార్టీ దెబ్బతీస్తోందా..? చట్టం ముందు అందరూ సమానులేనన్న భారత రాజ్యాంగం చెప్పిన మాట నిజం కాదనేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారా..? అంటే పసుపు పార్టీ నేతల వ్యాఖ్యలను పరిశీలిస్తున్న వారు అవుననే అంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నేతలు.. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు, సందేహాలు ఏర్పడుతున్నాయి.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు రోజు, వెళ్లిన రోజు, ఆ మరుసటి రోజు.. టీడీపీ నేతలు.. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకే ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్‌షాను కలుస్తున్నారంటూ విమర్శస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనపై పెట్టిన కేసులను సీఎం వైఎస్ జగన్ కోర్టుల ద్వారా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు ఛార్జీషీట్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. మరికొన్నింటిపై విచారణ జరుపుతున్నాయి. అయితే టీడీపీ నేతల వ్యాఖ్యల ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పెద్దల సిఫార్సుతో న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులను కూడా కొట్టివేయించుకోవచ్చనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. ఇది మొత్తంగా న్యాయవ్యవస్థ పనితీరు, నిజాయతీపై సందేహాలకు తావిస్తోంది.
టీడీపీ నేతలు విమర్శిస్తున్నట్లు కేసుల మాఫీ సాధ్యామా..? అంటే కాదనలేని పరిస్థితి ఉంది. అయితే అది అందరికీ సాధ్యమయ్యేనా..? అంటే చెప్పలేం. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ రెండు పూర్తిగా స్వంత్రమైన వేర్వేరు సంస్థలు. శాసన వ్యవస్థలో భాగమైన రాజకీయ నేతలు.. న్యాయవ్యవస్థను ప్రభావితం చేయాలంటే అందులో తమ మనుషులు ఉంటేనే సాధ్యమనే అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ అధినేత ఈ వ్యవహారంలో సిద్ధహస్తుడనే పేరు ఉంది. ఆయనపై అవినీతి, అక్రమార్జన, ఆక్రమ ఆస్తులు.. ఇలా అనేక అంశాల్లో విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకున్నారు.
ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఐదు కోట్ల రూపాయలు లంచం ఇచ్చేందుకు సిద్ధమై.. మొదట 50 లక్షలు ఇస్తూ చంద్రబాబు, ఆయన అప్పటి అనుచరుడు రేవంత్ రెడ్డిలు ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా దొరికారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి అరెస్ట్ అయి బెయిల్‌పై రాగా.. చంద్రబాబు మాత్రం అరెస్ట్ కాలేదు. పక్కా ఆధారాలు ఉన్నా చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో యావత్ దేశ ప్రజలే ఆశ్చర్యపోయారు. ఇక్కడే న్యాయవ్యవస్థ, చట్టం ముందు అందరూ సమానులే అనే రాజ్యంగం విశ్వసనీయతను కోల్పోయాయి. ఈ కేసు ప్రస్తుతం ఏ దశలో ఉందనేది కూడా ఎవరికీ తెలియదు. విచారణ పూర్తయి.. దోషులకు శిక్ష వేస్తారా..? అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతుంది.
ప్రస్తుతం అమరావతి కుంభకోణంపై జరుగుతున్న విచారణలోనూ, అభియోగాలు ఎదుర్కొంటున్న న్యాయ వ్యవస్థలోని ప్రముఖలతో టీడీపీ నేతలకు ఉన్న సంబంధాలపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. తీర్పులపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని కూడా గౌరవ ఏపీ హైకోర్టు సుమోటోగా కేసులు నమోదుకు ఆదేశించింది. ఈ అంశంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు జగన్‌పై నమోదైన కేసుల్లో జరుగుతున్న విచారణపై చేస్తున్న వ్యాఖ్యలు గౌరవప్రదమైన కోర్టుల విశ్వసనీయతకు, న్యాయమూర్తుల నిజాయతీకి గొడ్డలిపెట్టు వంటివి. వీరి వ్యాఖ్యలు కూడా న్యాయ విచారణకు అర్హమైనవేనన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.