iDreamPost
iDreamPost
ఏపీలో శాసనమండలికి దాదాపుగా మంగళం పాడుతున్న సంకేతాలు స్పష్టం అయిపోయాయి. సీఎం జగన్ ఒకసారి చర్చ జరగాలని చెప్పిన తర్వాత ఇక దాని సంగతి చూస్తున్నట్టేనని ఇప్పటికే రాజధాని విషయంలో తేలిపోయింది.
మూడు రాజధానుల ఆవశ్యకత గురించి చర్చించాల్సి ఉందని ఆయన చెప్పగానే తథాస్తు అన్నట్టుగా కమిటీలన్నీ నివేదికలు ఇచ్చేశాయి. ఇప్పుడు కాకపోతే మూడు నెలల తర్వాతయినా అవి ఆచరణ రూపం దాల్చడం ఖాయం అయిపోయింది. అదే రీతిలో శాసనమండలి కూడా దేశంలో ఆరు రాష్ట్రాలలనే ఉందని, ఆర్థికంగా భారం అని, అభివృద్ధిని అడ్డుకోవడం ద్వారా రాజకీయ లక్ష్యాలతో సాగుతోందని, మేథావులు అసెంబ్లీలోనే చాలామంది ఉన్న సమయంలో మండలి ఎందుకని ..ఇలా పలు ప్రశ్నలను జగన్ సూటిగా సంధించిన తరుణంలో ఇక మండలికి మరోసారి మంగళం పాడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ హయంలో రోశయ్య శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. ఆయన సారధ్యంలోవిపక్షం నాటి టీడీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో చివరకు శాసనమండలికి సెలవు చెప్పేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వైఎస్సార్ హయంలో మరోసారి పురుడు పోసుకున్న మండలికి నిండా పదిహేనేళ్లు నిండకుండానే ఇప్పుడు అర్థాంతరంగా ముగింపు దశకు రావడానికి అనేక కారణాలున్నాయి. విచక్షణాధికారం పేరుతో మండలి చైర్మన్ వ్యవహరించిన తీరు , అందుకు చంద్రబాబు నేరుగా విజిటర్స్ గ్యాలరీ నుంచి చేసిన హంగామా తోడుకావడంతో సర్కారు త్వరగా నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యింది. వాస్తవానికి గత నాలుగైదు నెలలుగా ప్రభుత్వ పెద్దల వద్ద మండలి రద్దు ప్రతిపాదన నానుతూ వస్తోంది. చివరకు నిర్ణయం తీసుకోడానికి తాజా పరిణామాలు తోడ్పడ్డాయి.
మండలి రద్దయితే తల్లడిల్లిపోవాల్సింది టీడీపీనే
ప్రస్తుతం శాసనమండలి రద్దయితే పలు పార్టీలకు నష్టం తప్పదు. ముఖ్యంగా శాసనసభలో ప్రాతినిధ్యం లేని వామపక్షాలు, బీజేపీ వంటి పార్టీలకు మండలిలో ఛాన్స్ దక్కింది. వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజల మద్ధతుతో పలువురు తటస్తులు సైతం విజయం సాధించి మండలి గౌరవం నిలిపారు. కానీ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రస్తుతం అత్యధిక శాసనమండలి స్థానాలకు ప్రధాన కారణం గత ఎన్నికలకు ముందు టీడీపీకి సభలో బలం ఉండడం, అదే సమయంలో 23 మంది ఫిరాయింపుదారులు తోడు కావడంతో మండలిలో టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. అదే ఇప్పుడు ఆపార్టీకి సమస్య అవుతోంది. చివరకు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ వంటి వారికి కూడా ముప్పు ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో ప్రోటోకాల్ అనుభవిస్తున్న పలువురు టీడీపీ నేతలకు అలాంటి అవకాశం కోల్పోతారు. యనమల వంటి వారు సుదీర్ఘకాలంగా ప్రత్యక్ష ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత మండలి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కూడా ఆశాభంగం తప్పదు. 1983 తర్వాత నిత్యం ఏదో సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. ఇక దానికి ఫుల్ స్టాప్ పడుతుందనే చెప్పవచ్చు.
ఎమ్మెల్సీ పదవి కోసం టీడీపీలో చేరిన పలువురు నేతలు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ సమకూర్చిన నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు మండలి రద్దు జరిగితే అలాంటి వారంతా తీవ్రంగా సతమతం కావాల్సి ఉంటుంది. ఎన్జీవో నేతగా చిరపరిచితుడైన అశోక్ బాబు కేవలం మండలి సీటు కోసమే టీడీపీ వెంట నడిచిన విషయం చాలామందికి తెలుసు. ఇప్పుడు ఆయన రాజకీయంగా నిరుద్యోగిగా మారక తప్పదు. ఇక ఆర్థికంగా కేసుల్లో కూడా ఉన్న జేసీ అల్లుడు దీపక్ రెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి, బీటెక్ రవి సహా పలువురున్నారు. ఇలాంటి వారందరికీ ఇప్పుడు మండలి వ్యవహారం మింగుడుపడే అవకాశం లేదు.
సన్ రైజ్ స్టేట్ అని చెప్పినా చివరకు సన్ స్ట్రోక్
చంద్రబాబు అమరావతి పేరుతో కొండనాలుకకు మందు వేస్తే ఇప్పుడు ఆయన తనయుడు సీటుకి ఎసరు తెచ్చింది. మండలి రద్దు వ్యవహారంలో లోకేశ్ పరిస్థితే అందరికన్నా దయనీయంగా మారుతుంది. మండలి లో ప్రవేశించడం ద్వారా ఏకంగా మంత్రి పదవి కూడా దక్కించుకున్న లోకేశ్ ఇప్పుడు మాజీగా మారిపోతారు. ఆయనకు ప్రోటోకాల్ సహా ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఉండవు. భద్రత విషయం లో ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు ఉండవు. దాంతో సన్ రైజ్ స్టేట్ గా చెప్పుకున్న చోట చంద్రబాబు తనయుడికి మండలి దెబ్బ పెద్ద స్ట్రోక్ గా మారబోతోంది. దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.