లోకేష్ ఆరోపించినట్లు రంగుల ఖర్చు 2600 కోట్లా ?. నిజమెంత .

వైసీపీ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో పంచాయితీ కార్యాలయాలకు,కొత్తగా నిర్మించిన కొన్ని సచివాలయాలకు రంగులు వేసే క్రమంలో వైసీపీ పార్టీ జెండాలోని రంగులు ఎంచుకొని వేసిన విషయం విదితమే . అయితే ఈ అంశం పై పలు విమర్శలు చేసిన టీడీపీ పార్టీ , స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఈ రంగులను చెరిపివేయాలని కోర్టులో పిటిషన్ వేసింది .

కేసు పూర్వాపరాలు పక్కన బెడితే ఈ పెయింట్స్ వేయటానికి వైసీపీ ప్రభుత్వం 1300 కోట్లు ఖర్చు పెట్టింది అని టీడీపీ ఆరోపిస్తుండగా , సోషల్ మీడియాలో టీడీపీ పేజ్ లో సైతం రంగులకు ఖర్చు పెట్టిన 1300 కోట్లు ఉంటే ఈ కరోనా సమయంలో అన్న కాంటీన్ల ద్వారా అన్నదానం చేయటానికి ఉపయోగపడేవి అని ఆరోపించగా,టీడీపీ మాజీ మంత్రి , ఎమ్మెల్సీ లోకేష్ మరో అడుగు ముందుకేసి పెయింట్స్ వేయటానికి 1300 కోట్లు , వాటిని చెరపటానికి 1300 కోట్లు మొత్తం 2600 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు .

టీడీపీకి ప్రజాధనం మీద అంత శ్రద్ద ఉంటే వేసిన రంగులు చేరిపివేయమని అది 1300 కోట్లు అవుతాయని లెక్క కట్టిన టీడీపీ నేతలు ఆ రంగులు చెరిపివేయమని కోర్టుకి వెల్లటం, ప్రజాధనం దుర్వినియోగం చేయించటం ఎందుకు?అది దుర్మార్గం కాదా ? .1300 కోట్లు దుర్వినియోగం కావటానికి కారణం కాదా ?. వైసీపీ అధికారంలోకి వచ్చాక కరకట్ట పై అక్రమ నిర్మాణం అయిన ప్రజావేదిక కూల్చినప్పుడు అది అక్రమమైనా కానీ ప్రజాధనంతో నిర్మించినందున కూల్చి ప్రజాధనాన్ని నేలపాలు చేశారని చంద్రబాబు గారు , లోకేష్ , పలువురు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు వారు మర్చిపోయారేమో కానీ ప్రజలు మర్చిపోలేదు .

తమ హయాంలో స్మశానాలకు కూడా పచ్చ రంగు వేయించిన టీడీపీ నేతలకు ఇప్పుడు పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వొద్దని చెప్పే నైతిక హక్కు ఉందా ?

మరి ఈ రోజు గ్రామ పంచాయితీలు , గ్రామ సచివాలయాలు అక్రమ నిర్మాణాలు కావు , కేవలం రంగులు వైసీపీ పార్టీవి అనే కారణంగా కోర్టుకి వెళ్లి రంగులు మార్చమని కోరడం ప్రజాధన దుర్వినియోగం కదా , అది రాష్ట్ర ప్రజలకి చేస్తున్న తీవ్ర అన్యాయం కాదా ? . అన్యాయం అని తెలిసీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇందుకు పూనుకోవడం ఎంతవరకు సబబు ?. ఇదేనా టీడీపీ పార్టీకి రాష్ట్రం పై , ప్రజల పై ఉన్న ప్రేమ ? . ఇది టీడీపీ బాధ్యతారాహిత్యం కాదా ? .

పెయింట్స్ వేయటానికి వైసీపీ నిజంగా 1300 కోట్లు ఖర్చు పెట్టిందా ? . ఈ విషయానికి సంబంధించి జీవో కానీ , ప్రభుత్వం 1300 కోట్లు కేటాయించిన ఆదేశాలు కానీ ఏవీ లేవు . ఆయా పంచాయితీలు , స్థానిక సంస్థల నిధుల నుండి ఖర్చు చేసి వేసిన పెయింట్స్ ఇవి . అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెయింట్స్ కోసం చేసిన ఖర్చు ఎంత అనేది ఒక అంచనాకు రావాలంటే ఆయా పంచాయితీలు తమ భవనాలకు రంగులు వేయటానికి ఎంత ఖర్చు చేసింది అనేది తెలుసుకోవాలి .

సదరు పెయింటింగ్ పనులన్నీ APSSR2018-19 ధరల్ని అనుసరించి జరిగి M బుక్స్ ద్వారా రికార్డు అయ్యి ఉన్నాయి . వాటిని పరిశీలించిన మీదట గ్రామ పంచాయతి భవనం వైశాల్యాన్ని,ఎత్తుని బట్టి ఒక్కో పంచాయితీకి కనిష్టంగా 18 వేల నుండి గరిష్టంగా 35 వేల వరకూ ఖర్చు అయ్యింది చెప్పవొచ్చు. అంటే రంగుల సగటున ఖర్చు 25 వేలు అని అంచనాకు రావొచ్చు . కానీ గరిష్టంగా 30 వేల చొప్పున తీసుకొని 30,000 భవనాలకు ఎంత ఖర్చయ్యిందో పరిశీలించి చూస్తే 13000 ×30000 =39,00,00,000 . ( అక్షరాల ముప్పై తొమ్మిది కోట్లు ) .

అలాగే గ్రామ సచివాలయాల విషయానికొస్తే వైసీపీ ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన సచివాలయాలు 11,158,రంగుల ఖర్చు 11158 × 30000=33,47,40,000 (ముప్పై మూడు కోట్ల నలభై ఏడు లక్షల నలభై వేలు ) . అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల్లో సొంత భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నది సుమారు 2800 మాత్రమే . మిగతా కార్యాలయాల భవనాలు నిర్మాణంలో లేదా ప్రారంభ దశలో ఉన్నాయి . ఈ కార్యాలయాలను తాత్కాలికంగా వివిధ ప్రభుత్వ శాఖల భవనాల్లో ఏర్పాటు చేసినందున వాటికి రంగులు వేయలేదు . అంటే అంచనాల ప్రకారం 33 కోట్లు ఖర్చు కాలేదు . రంగులు వేసిన సచివాలయ భవనాలు
2800  × 30000 =8,40,00,000 (ఎనిమిది కోట్ల నలభై లక్షలు) మాత్రమే సచివాలయాలకు ఖర్చు అయ్యాయి . ఈ లెక్కల ప్రకారం వాస్తవ ఖర్చు 39 + 8.4= 47.4 కోట్లు.

రాష్ట్ర వ్యాప్తంగా 13000 గ్రామాల్లో 15800 భవనాలకు రంగులేసిన వాస్తవ ఖర్చు47.4 కోట్లు . అంటే టీడీపీ ఆరోపించిన 1300 కోట్లలో నిజానికయ్యిన ఖర్చు 3.65 శాతం . ఇదీ టీడీపీ ఆరోపణలోని అసలు నిజం .

అయితే గత టీడీపీ హయాంలో కేంద్ర నిధులతో నిర్మించిన స్వచ్ఛ భారత్ దొడ్లకి , స్మశానాలకి , వాటర్ ట్యాంక్ లకి , రాష్ట్ర నిధులతో పంచాయితీ భవనాలకు పసుపు రంగులేయటానికి ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేసిందో , ఎందుకలా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించలేదు . అలాగే ఒక రాజకీయ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేయడం చట్ట వ్యతిరేకమైనప్పుడు తాము అదే పని చేసినందుకు , అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా టీడీపీ పై ఉంది . అలాగే తమ పార్టీ వేసిన రంగుల్ని కూడా చెరిపివేయించాలని న్యాయస్థానాన్ని కోరి తమ సచ్చీలతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది .

Show comments