Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలబోతోంది. నిన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌లు టీడీపీ బండి దిగి వైఎస్సార్‌సీపీ బండి ఎక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలువులు టీడీపీ మాజీ ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు మంగళవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే(కనిగిరి, ప్రకాశం జిల్లా), సినీ నటుడు బాలకృష్ణ స్నేహితుడు కదిరి బాబూరావు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని సమాచారం. సాయంత్రం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కదిరి బాబూరావు కలుస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
కదిరి బాబూరావు రాజకీయ ప్రయాణం టీడీపీతోనే ప్రారంభమైంది. బాలకృష్ణ ప్రోద్బలంతో 2004లో కదిరి బాబూరావు కి దర్శి టికెట్ దక్కింది. దాదాపు రెండు వేల ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2009లో సొంత నియోజకవర్గం కనిగిరి నుంచీ బరిలోకి దిగారు. అయితే ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లు.. నామినేషన్ చెల్లకుండా పోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే తేరుకున్న కదిరి బాబూరావు ఉంగరం గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బంధువు సుంకర మధుసూదన్‌కు మద్ధతు తెలిపారు. సుంకర గెలిస్తే అతని చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలన్నది బాబూరావు ప్రణాళిక. ఇందు కోసం ఆయన సుంకర మధుసూదన్‌తో ఒప్పదం చేసుకుని పత్రాలు కూడా రాయించుకున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో బరిలోకి దిగారు.
బాబూరావు నామినేషన్ చెల్లకుండా పోవడంతో తొలిసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఉదాసీనంగా ఉన్నారు. కార్యకర్తలను, నాయకులను పట్టించుకోకుండా ఓకింత గర్వంతో వ్యవహరించారు. షెడ్యూల్ విడుదలైన సమయం నుంచీ కనిగిరిలో కార్యకర్తల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని రద్దు చేయించారు. మరో వైపు కదిరి బాబూరావు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో ఉగ్రనరసింహారెడ్డికి ఆ ఎన్నికల్లో ముచ్చెమటలు పట్టాయి. చివరికి తన దాయాదు, వరసకు బాబాయి అయ్యే మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి మద్ధతుతో చావు తప్పి కన్నులోట్టపోయినట్లు కేవలం 19 వందల ఓట్లతో గెలిచారు.
ఇక 2014లో మరోసారి టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న బాబూరావు.. ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే గ్రామీణ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేని మద్ధతు ఉండడంతో గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి. అందుకే కనిగిరి, పామూరు పట్టణాల్లో 2009లో నామినేషన్ చెల్లకపోవడంతో కన్నీరుమున్నీరైన దృశ్యాలను కరపత్రాలుగా ముద్రించి పంచారు. ఎన్నికల రోజు ఆ రెండు పట్టణాల్లో ఓటుకు ఐదు వేల వరకూ పంచారు. దీంతో ఆ పట్టణాల్లో వచ్చిన మెజార్టీతో కదిరి గట్టెక్కి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
2019లోనూ కనిగిరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూదన్ యాదవే మళ్లీ పోటీలో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వైఎస్సార్‌సీపీ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిల మధ్య టీడీపీలో కనిగిరి టిక్కెట్ కోసం పోటీ నడిచింది. యాదవ సామాజికవర్గానికి చెందిన బుర్రా మధుసూదన్‌పై రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని నిలబెడితే గెలుపు ఖాయమని భావించిన చంద్రబాబు కనిగిరి సీటను ఉగ్రకు కేటాయించారు. కదిరి బాబూరావును దర్శి నుంచి పోటీ చేయాలని ఆదేశించారు.
అయితే దర్శికి వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేని కదిరి బాబూరావు కనిగిరి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించారు. గతంలో ఈ ప్రాంతంలో బలిజలు బీసీలుగా ఉన్నారని చెబుతూ.. బీసీ కోటాలో తనకు సీటు ఇవ్వాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో మంతనాలు జరిపారు. పార్టీ ఫండ్ కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే 9 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న బుర్రా మదుసూదన్ వైపే జగన్ నిలవడంతో బాబూరావు ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అయిష్టంగానే.. టీడీపీ తరఫున దర్శి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్ధిశెట్టి వేణుగోపాల్‌పై పోటీ చేసి ఓడిపోయారు.
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కదిరి బాబూ రావు టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. అటు దర్శిలోనూ, ఇటు కనిగిరిలోనూ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు. కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో యాక్టివ్‌గా పని చేయడం ఆరంభించారు. పార్టీ కార్యక్రమాలు, అమరావతి ఉద్యమం.. ఇలా ప్రతి అంశంపై జిల్లాలో అందరి కన్నా మిన్నగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ కోసం కదిరి బాబూరావు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన వియ్యంకుడు కడప జిల్లాకు చెందిన నేత సి. రామచంద్రయ్య ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. ఆయన సూచనతోనే కదిరి బాబూరావు అధికార పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.