iDreamPost
android-app
ios-app

బోండా ఉమా సెల్ఫ్‌ గోల్‌..!?

బోండా ఉమా సెల్ఫ్‌ గోల్‌..!?

‘‘ కాపు నేస్తం పథకం పేరుతో కాపులను ఆదుకుంటున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే దీన్ని కాపు ద్రోహంగానే కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తెగలేసినట్లుగా వీరి విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మీ మాటలతో, ఆర్భాటపు ప్రచారాలతో కాపుల కడుపు నిండదు. తప్పుడు లెక్కలతో మభ్యపెడితే నమ్మడానికి కాపులు పిచ్చొళ్లు కాదని ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. రాష్ట్రంలో 2.36 లక్షల మందే కాపు మహిళలు ఉన్నట్లు ప్రభుత్వ పెద్దలు ఒప్పుకుంటారా..? నాతో చర్చకు వస్తారా..?’’ ఇవీ వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో ప్రారంభించిన పథకంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన విమర్శలు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల్లోని 45 ఏళ్లు దాటిన పేద మహిళలకు పింఛన్‌ ఇవ్వాలనే ఆలోచనను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ చేశారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఆయన విరమించుకున్నారు. మేనిఫెస్టోలో కూడా దాన్ని ప్రస్తావించలేదు. అయితే ఆయా కులాల్లోని పేద మహిళలకు సహాయం చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ చేయూత అనే పేరుతో 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 చొప్పున ఐదేళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు కూడా ఇలానే సహాయం చేయాలని వైఎస్‌ జగన్‌ తలపెట్టారు. అందుకోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పేరుతో కాపుల్లోని పేద మహిళలైన 45 నుంచి 60 ఏళ్ల లోపు వారికి ఏడాదికి 15 వేల రూపాయల చొప్పన ఐదేళ్లలో 75 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. హామీ ఇవ్వపోయినా సీఎం జగన్‌ కాపు సంక్షేమానికి కట్టుబడి ఉన్నానంటూ పేద కుటుంబాల్లోని మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. బుధవారం 2.36 లక్షల మంది కాపు మహిళల ఖాతాల్లో 15 వేల చొప్పున నగదు జమ చేశారు. ఇదీ ఈ పథకం పెట్టడానికి గల ప్రధాన ఉద్దేశం, పథకం పూర్వాపరాలు.

ఇక బొండా ఉమా చేసిన విమర్శలు చేసిన విషయానికి వస్తే… కాపులను ఆదుకుంటామని ప్రభుత్వం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టినా.. దీన్ని కాపు ద్రోహంగానే ఆయా సామాజికవ వర్గాల ప్రజలు భావిస్తున్నారంటూ ఉమా తనకు తానే వారి మాటలుగా చెప్పారు. ఏరు దాటక తెప్ప తగలేసినట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ బొండా ఉమా మరో విమర్శ చేశారు. కాపులకు ద్రోహం ఎవరు, ఎప్పుడు చేశారో కొంచెం కాలం వెనక్కి వెళితే అర్థం అవుతుంది. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చి, దాన్ని అమలు చేయకపోగా ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరినా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, కాపు యువత, నేతలపై టీడీపీ కేసులు పెట్టి వేధించడాన్ని కాపు ద్రోహంగా భావిస్తారా..? లేదా..? ఇచ్చిన మాట ప్రకారం వారి ఆర్థిక అభ్యున్నతి కోసం పాటు పదే వారి పాలనను ద్రోహం అంటారా..? అనేది కాపు నేత అయిన బొండా ఉమానే చెప్పాలి. ఎవరు ఏరు దాటాక తెప్ప తగలేశారో టీడీపీ కాపు నేతలకు తెలియకపోయినా.. ఏపీలోని కాపు సామాజిక వర్గ ప్రజలు గతాన్ని మాత్రం మరువలేదు. ఆ విషయం గడచిన ఎన్నికల్లోనే అర్థం అయింది.

ఇక కాపు మహిళలు 2.36 లక్షల మందేనా..? తప్పుడు లెక్కలు చెబుతున్నారు. తాను చర్చకు సిద్ధం అంటూ బొండా విమర్శ చేశారు. ఇక్కడ బొండా ఉమా ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంది. అసలు వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ఉద్దేశం, అర్హతలు ఏమిటో తెలుసుకుంటే ఈ విమర్శ చేసేవారు కాదని చెప్పవచ్చు. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న పేద కాపులకే ఈ పథకం వర్తిస్తుంది. 60 దాటితే పింఛన్‌కు అర్హులు కాబట్టి ఈ వయస్సు వారికి ఈ పథకం పెట్టారు. మాటలు, ప్రచారపు ఆర్భాటాలతో కాపుల కడుపు నిండదని అంటున్న బొండా ఉమాకు కాపుల సంక్షేమం కోసం తమ టీడీపీ ప్రభుత్వం ఎలా పని చేసిందీ, వైసీపీ ప్రభుత్వం ఏమి చేస్తోంది ఒక్క సారి సింహావలోకనం చేసుకుంటే తెలుస్తోంది. కాపులను బీసీల్లో చేర్చడమే కాదు వారికి ఏడాదికి వెయి కోట్లు ఇస్తామంటూ నాడు బాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. మరి ఇచ్చిందా..? వైఎస్‌ జగన్‌ కాపులను బీసీల్లో చేర్చే అధికారం మన చేతిలో లేదంటూ తాను చేయగలిగింది మాత్రమే చెప్పారు. ఏడాదికి 2 వేల కోట్ల రూపాయల చొప్పన ఐదేళ్లలో 10 వేల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఇస్తామని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి పని చేస్తున్నారని బొండా ఉమాకు తెలియంది కాదు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా ఉంది.