iDreamPost
iDreamPost
ఎంతసేపూ మన హీరోలు తమిళ దర్శకుల వెంటపడటమే కానీ టాలీవుడ్ డైరెక్టర్లతో తమిళ స్టార్లు సినిమాలు చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. చరిత్రను తవ్వినా మణిరత్నం, కె బాలచందర్, కెఎస్ రవికుమార్, సురేష్ కృష్ణ, కరుణాకరన్, ధరణి, మణివణ్ణన్ ఇలా ఎందరో ఇక్కడ చెప్పుకోదగ్గ చిత్రాలు చేశారు కానీ ఇక్కడి నుంచి వెళ్లి ఆరవ కథానాయకులను మెప్పించిన వాళ్ళు తక్కువ. సదరు ప్రాంతీయాభిమానం అలాంటిది మరి. ఇప్పటికీ రామ్ లాంటి యంగ్ స్టర్స్ లింగుస్వామితో చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇదంతా గతం. మెల్లగా పక్కరాష్ట్రం హీరోలు మన టాలెంట్ వైపు కన్నేస్తున్నారు. హద్దులు పెట్టుకుంటే లాభం లేదని గుర్తిస్తున్నారు
అందులో భాగంగానే కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో విజయ్ వంశీ పైడిపల్లికి ఎస్ చెప్పాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దీని తాలూకు ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇవాళ పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ చేశారు. పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ గా కానిచ్చేశారు. తమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చనుండటం విశేషం.విజయ్ కు చిన్నప్పటి నుంచే ఫ్యాన్ గా ఉన్న ఇతనికి ఇది బంపర్ ఆఫర్. ఇంత తక్కువ గ్యాప్ లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, విజయ్ లాంటి వాళ్లకు మ్యూజిక్ ఇచ్చే అవకాశం రావడం అంటే విశేషమేగా.
ఒకప్పటి ఆడియన్స్ ఆలోచనా ధోరణిలోనూ చాలా మార్పు కనిపిస్తోంది. తెలుగు డబ్బింగ్ లంటే కొంచెం చిన్న చూపు చూసే తమిళ ప్రేక్షకులు ఈ మధ్య మన సినిమాలు బాగా ఆదరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. రాజమౌళి బ్రాండ్ అని కాదు కానీ ఇప్పుడక్కడ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు మంచి గుర్తింపు వచ్చింది. పుష్ప కూడా బాగా వసూలు చేసింది. గతంలో మనం తమిళ అనువాద సినిమాలను ఎలా అయితే నెత్తినబెట్టుకున్నామో ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతోంది. రజనీకాంత్, విక్రమ్, సూర్యలకు మార్కెట్ ఇక్కడ డౌన్ అయితే మనవాళ్లది మాత్రం క్రమంగా పెరిగే దిశగా వెళ్తోంది. ఇదే కదా కావాల్సింది