అసురన్ తమిళంలో సంచలన విజయాన్ని సాధించింది. అసురన్ రూపొందించిన వెట్రిమారన్ ఖాతాలో భారీ విజయం దక్కింది.గత కొంతకాలంగా ఫ్లాపుల్లో కూరుకుపోయిన ధనుష్ ని అసురన్ ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కించిన డైరెక్టర్ వెట్రిమారన్. తెలుగులో వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ ను వెట్రిమారన్ రూపొందించనున్నారని ఊహాగానాలు సినీవర్గాల్లో కలిగాయి. కానీ ఇప్పుడు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతుందని నిర్మాత థాను ప్రకటించడంతో తెలుగులో అసురన్ రీమేక్ వెట్రిమారన్ రూపొందిస్తారన్న ఊహాగానాలకు తెరపడింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా కథానాయకుడు సూర్య ప్లాపుల్లో కూరుకుపోయాడు. ఒకప్పుడు తెలుగు సినిమాలకు ధీటుగా సూర్య సినిమాలు తెలుగులో విజయం సాధించేవి. శివపుత్రుడు,గజిని,సింగం సిరీస్ లతో తెలుగు స్టార్ హీరోలతో సమానంగా కలెక్షన్స్ రాబట్టేవి సూర్య సినిమాలు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.సూర్య తెలుగులో హిట్ రుచి చూసి చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు వరుస ప్లాపులతో సూర్య దాదాపుగా తెలుగులో మార్కెట్ కోల్పోయాడు. సూర్య హీరోగా నటించిన గ్యాంగ్, NGK, బందోబస్త్ సినిమాలు ప్రేక్షకులను పూర్తిగా నిరుత్సాహపరిచాయి. దానితో తెలుగులో సూర్య మార్కెట్ దాదాపుగా పడిపోయింది.
వెట్రిమారన్ అట్టడుగు వర్గాల కథలను జనరంజకంగా చెప్పడంలో నేర్పరి. పొల్లాదవన్(కుర్రాడు), ఆడుకలం(పందెం కోళ్లు),విసారణై(విచారణ), అసురన్ సినిమాలను గమనిస్తే వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ అర్ధం అవుతుంది. అట్టడుగు వర్గాల కథలను హృదయానికి హత్తుకునే విధంగా రూపొందించే వెట్రిమారన్ సూర్యను ఎలా చూపించబోతున్నారో అని ఇప్పుడే సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
వరుస ప్లాపుల్లో కూరుకుపోయిన సూర్య ఆశలన్నీ ఇప్పుడు సుధ కొంగర రూపొందిస్తున్న “ఆకాశమే హద్దు” సినిమాపైనే ఉన్నాయి. విభిన్న చిత్రాలతో ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సూర్యకు ప్రస్తుతం గడ్డుకాలమే నడుస్తుంది. ఏది ఏమైనా సగటు సినీ ప్రేక్షకుల్లో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే సూర్య, విభిన్నమైన సినిమాలు రూపొందించే వెట్రిమారన్-సూర్య కాంబినేషన్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. వెట్రి మారన్ అయినా సూర్యని హిట్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి.