iDreamPost
android-app
ios-app

తేగేదాకా లాగొద్దు..!

తేగేదాకా లాగొద్దు..!

తాడో పేడో తేల్చుకోమంటారు..పెద్దలు. అంతేకాదు అదే సమయంలో తెగేదాకా లాగొద్దని చెబుతారు ఆ పెద్దలే..అంటే అర్దం సందర్భాను సారం..నిర్ణయం తీసుకోవాలని అర్దం.. అంతేకాని తాడో పేడో తేల్చుకునే సమయం వచ్చింది కాబట్టు తాము పట్టిన కుందేటికి ముూడేకాళ్లు అనడం సరైంది కాదన్నది దాని పరోక్ష హెచ్చరిక..ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ప్రపంచాన్ని కదిలించిన రైతు పోరాటం సుప్రీం తీర్పుతో చివరి దశకు చేరిందనే చెప్పాలి.

రైతు ఉద్యమంపై సుప్రీం కోర్టు స్పందించి తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు కేంద్రాన్ని తప్పుబట్టింది. సమస్య పరిష్కారం అయ్యేవరకు తాత్కాలికంగా చట్టాల అమలు నిలిపివేయమని కేంద్రానకి సూచించింది. అవసరమైతే ఈ చట్టాల అమలుపై స్టే విధిస్తామన్న న్యాయస్థానం.. ఆమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. భూపేందర్‌ సింగ్‌‌ మాన్‌(బీకేయూ), ప్రమోద్‌ కుమార్‌ జోషి(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), అశోక్‌ గులాటీ(వ్యవసాయ శాస్త్రవేత్త), అనిల్‌ ఘావంత్‌(షెట్కారీ సంఘటన)ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రైతులు వెనక్కి తగ్గమని మెుండికేస్తున్నారు. సాగు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా ఢిల్లీ కేంద్రంగా తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేస్తేనే వెనక్కి వెళ్తామని పేర్కొంటున్నారు. అంటే కోర్టుకు వెళ్లిన తర్వాత, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం కోసం సర్వోన్నత న్యాయస్థానానికి సహకరించాలి. తీర్పుకు ఇరువర్గాలు కట్టుబడి ఉండాలి. కానీ రైతులు తాడో పేడో తేల్చుకుంటామన్న వైఖరి అవలంభించడం సరైంది కాదంటున్నారు పరిశీలకులు. అంతేకాదు ఇక్కడ సుప్రీం వ్యాఖ్యాలను రైతులు అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తీర్పు సందర్భంగా కమిటీని నియమించే అధికారం తమకు ఉందని అభిప్రాయపడింది. ‘అందరి కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, నివేదిక సమర్పించేందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. అందుకు రైతు సంఘాలు సహకరించాలి సూచించింది. సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు కమిటీని సంప్రదించాలని స్పష్టం చేసింది. ఒకవేళ రైతు సంఘాలు కమిటీకి సహకరించకపోతే.. ప్రధానిని ఏదైనా చెయ్యమని మేం అడగలేం కదా అంటూ..సహకరించక పోతే భవిష్యత్తులో పరిణామాల గురించి సుప్రీం పరోక్షంగా హెచ్చరించింది. మరోవైపు.. రైతుల ట్రాక్టర్ల ర్యాలీపై ఢిల్లీ పోలీసులే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీపై హోంశాఖదే తుది నిర్ణయం అని తేల్చి చెప్పింది.

ఇది తాత్కాలికి విజయం!

ఈ రైతుల పోరాటం దేశంతో ప్రపంచాన్ని కదిలించింది. పలు దేశాలు, సంస్థలు వీరి ఆందోళనకు సంఘీభావం ప్రకటించాయి. అయితే ఈ ఉద్యమం రైతుల బలిదానాలు కూడా చోటుచేసుకుంటుండడం బాధించే విషయం. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బాబా నసీబ్ సింగ్ మన్ అనే రైతు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 48 రోజుల ఉద్యమంలో ఇప్పటివరకు దాదాపు 57 మంది రైతులు చనిపోయారు. వారిలో కొందరు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరు అనారోగ్యంతో మృతిచెందారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతులు అత్యల్ప ఉష్ణోగ్రత్తలు ఉండడంతో చలికి తట్టుకోలేక ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 8 సార్లు చర్చలు చేసినా రైతులు ఒక్క మెట్టు కూడా దిగకుండా నిరంతర పోరు సాగిస్తున్నారు. తమకు కావాల్సింది నూతన వ్యవసాయ చట్టాల రద్దు అని తమ డిమాండ్‌ను స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి.. పోలీసుల వేధింపులతో పాటు వాతావరణాన్ని తట్టుకుని అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.

వీరి పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అవహేళన చేసినా పట్టించుకోలేదు. పిజ్జా-బర్గర్లు తిని పోరాటం.. ఆందోళనకారులంతా ఉగ్రవాదులు.. తీవ్రవాదులని ఆరోపించినా వెరవకుండా పోరాట పంథా వీడడం లేదు. అలాంటి రైతుల పోరాటానికి సుప్రీంకోర్టు కరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూనే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ధర్మాసనం నిర్ణయంతో రైతుల పోరాటానికి తాత్కాలిక విజయం దక్కినట్టుగా భావించవచ్చు.