iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ వ్యవహారం : రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ విచారణకు డేట్‌ ఫిక్స్‌ చేసిన సుప్రిం కోర్టు

నిమ్మగడ్డ వ్యవహారం :  రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్  విచారణకు డేట్‌ ఫిక్స్‌ చేసిన సుప్రిం కోర్టు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారం చివరి అంకానికి చేరుకుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌నే తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రిం ధర్మాసనం విచారణకు సంబంధించి తేదీని నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రిం చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసం విచారణ చేపట్టనుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలను తీసుకువచ్చిన క్రమంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన పదవిని కోల్పోయారు. ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించడం, హైకోర్టు మాజీ న్యాయమూర్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం, ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాల నివారణ.. తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీంతో ఇప్పటికే నాలుగేళ్లు పదవీ కాలం పూర్తయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు దాని నుంచి వైదొలగాల్సి వచ్చింది. నూతన ఎన్నికల కమిషనర్‌గా మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి వి.కనగరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ తనకు వర్తించడదని, తనను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తోపాటు ఆయనకు మద్ధతుగా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్,జీవోలను రద్దు చేస్తూ నిమ్మగడ్డనే తిరిగి నియమించాలని తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషనర్‌ను నియమించే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి లేదని చెప్పింది.

రాష్ట్ర మంత్రిమండలికి ఆ అధికారం లేనప్పుడు.. తిరిగి నియమించే అధికారం కూడా లేదని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ పేర్కొన్నారు. అలా అయితే నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నియామకం కూడా చట్టబద్ధం కాదన్నారు. చంద్రబాబు మంత్రివర్గం సిఫార్సు మేరకు అప్పటి గవర్నర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ కారణాల నేపథ్యంలోనే అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రింలో సవాల్‌ చేసింది. ఏది ఏమైనా దాదాపు మూడు నెలలుగా సాగుతున్న నిమ్మగడ్డ వ్యవహారానికి మరికొద్ది రోజుల్లో ముగింపు పడనుంది.