iDreamPost
android-app
ios-app

“చెయ్యి” వదిలేసిన ఎమ్మెల్యేలు

“చెయ్యి”  వదిలేసిన ఎమ్మెల్యేలు

దేశవ్యాప్తంగా మరో రెండు రోజుల గడువులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ రాజ్యసభ సీట్లు కైవసం చేసుకోవడానికి అధికార బిజెపి గుజరాత్‌లో ఇప్పటికే ఆపరేషన్ కమలంను విజయవంతంగా పూర్తి చేసింది.ప్రస్తుతం బిజెపి చూపు మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై పడింది.

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలకు రెండు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.గతంలో కమల్‌నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచిన ఐదుగురు బిజెపి యేతర,కాంగ్రెసేతర ఎమ్మెల్యేలు అధికార బిజెపికి మద్దతు ప్రకటించారు.భోపాల్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బిజెపి ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. వీరిలో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాంబాయి, సంజీవ్ సింగ్ కుష్వా,సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఏకైక ఎమ్మెల్యే రాజేష్ శుక్లా,ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు విక్రమ్ సింగ్ రానా, సురేంద్ర సింగ్ షెరా ఉన్నారు.గతంలో కమల్‌నాథ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు బిజెపి విందులో పాల్గొన్నారు.ఇక మిగిలిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కమలం చెంతకు చేరుతున్నట్లు ప్రకటించారు.

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీకి రెండు స్థానాలు తక్కువగా 114 స్థానాలను గెలుచుకుంది.అయితే బిఎస్పీ,ఎస్పీ పార్టీలు,స్వతంత్రుల మద్దతుతో కమల్‌నాథ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరచింది.కానీ ఈ ఏడాది మార్చి చివరలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు జ్యోతిరాదిత్య నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.దీంతో 15 నెలల కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయింది.గత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెసేతర,బిజెపియేతర ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తాజాగా అధికార కమలం పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.

ఈ నేపథ్యంలో బుధవారం కొత్త శాసనసభ్యులకు రాజ్యసభ ఓటింగ్‌పై శిక్షణ ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్వహించిన సమావేశానికి తమ మద్దతుదారులైన కాంగ్రెసేతర ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.కానీ పిసిసి చీఫ్ కమల్ నాథ్ నిర్వహించిన శాసనసభ పార్టీ సమావేశానికి హాజరుకాని ఐదుగురు శాసనసభ్యులు పార్టీకి ముందుగానే సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పి సి శర్మ తెలపడం గమనార్హం. ఇదిలావుండగా బుధవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్దీప్ డాంగ్ తన మద్దతుదారులతో బిజెపిలో చేరారు.

ప్రస్తుతం 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిజెపికి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా,తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల తరువాత కాంగ్రెస్ బలం 92 కి తగ్గింది. అలాగే అసెంబ్లీలో కాంగ్రెస్,బిజెపికి పార్టీలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే మృతి చెందడంతో పాటు 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలతో మొత్తం 24 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఇక మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలలో ఒక్కో స్థానం గెలవడానికి 52 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అయితే తాజా రాజకీయ సమీకరణాలతో సొంతంగా 107 మంది ఎమ్మెల్యేల బలం గల బిజెపి,ఏడుగురు కాంగ్రెసేతర సభ్యుల మద్దతు కూడా సంపాదించింది.దీంతో మొత్తం 114 మంది ఎమ్మెల్యేల మద్దతు గల అధికార బిజెపికి రెండు రాజ్యసభ స్థానాలు సునాయాసంగా దక్కే అవకాశం ఉంది. తమ మద్దతుదారులైన బిఎస్పీ ,ఎస్పీ,స్వతంత్ర ఎమ్మెల్యేలు చేజారుతూన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో రాజ్యసభ ఎన్నికలలో ఒక అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి