ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అనేకమంది అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీల అవస్థలు చెప్పడానికి మాటలు సరిపోవు. ఆకలితో బాధపడుతూ, కొన్ని వందల కిలోమీటర్లు నడుస్తూ వెళ్తున్నారు.స్వస్థలాలకు చేరుకోవాలని నడిచి వెళ్తూ మరికొందరు ఆకలికి తాళలేక మార్గమధ్యంలో చనిపోయారు కూడా. దాంతో స్వస్థలాలకు చేరుకోవడానికి కొందరు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలా స్వస్థలాలకు చేరుకోవాలని ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే ముగ్గురు విద్యార్థులు లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించి పొందుగుల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు. విద్యార్థులు హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వెళ్తున్న పాల ట్యాంకర్ లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి ప్రకాశం జిల్లా చేరుకోవడానికి ముగ్గురు విద్యార్థులు ఎక్కారు. విద్యార్థులు ట్యాంకర్ లో ఉన్నట్లు పొందుగుల చెక్ పోస్ట్ వద్ద జరిగిన తనిఖీల్లో గుర్తించారు పోలీసులు.
దీంతో విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించారు. విద్యార్థులను అక్రమంగా తరలిస్తున్న నేరానికి డ్రైవర్ పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసారు. విద్యార్థులను విచారించిన అనంతరం తిరిగి తెలంగాణ రాష్ట్రానికి పంపారు అధికారులు. లాక్ డౌన్ నిబంధనలు మీరి అక్రమంగా ఎవరినైనా తరలించడానికి ప్రయత్నిస్తే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.