వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లొచ్చని కేంద్రం ప్రకటించడంతో స్వస్థలాలకు చేరుకోవడానికి అనేకమంది ప్రయత్నం చేస్తున్నారు.
కాగా తెలంగాణలో చిక్కుకున్న అనేకమంది వలసకూలీలు,విద్యార్థులు కేంద్రం ప్రకటనతో సూర్యాపేట వద్ద ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. కానీ పోలీసులు వారిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వలసకూలీలు తమను రాష్ట్రంలోకి అనుమతించాలని ఆందోళనకు దిగారు..
అలా రాష్ట్రానికి రావడానికి ప్రయత్నించవద్దని పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీకి చెందినవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వలస కూలీలు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఇలా వస్తున్నవారికి సదుపాయాలు కల్పించడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. కరోనా నివారణ, సహాయ చర్యలపై ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రం వెలుపల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సహాయం కోసం ప్రత్యేకంగా ఓ నెంబర్ ను ఏర్పాటు చేసింది. 0866 2424680 కి ఫోన్ చేసి ఎవరైనా తమ పేరు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ నెంబర్ చెబితే చాలు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే..
కాగా ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తితో వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్ళే విషయంలో పునరాలోచనలో పడ్డారు. సరిహద్దుల్లో ఇబ్బందులు పడేకంటే ఎక్కడివారు అక్కడే ఉండటం మంచిదని అధికారులు చెబుతున్నారు.