రెడ్ జోన్ ల పై ప్రత్యేక నిఘా.. ఏపీ ప్రభుత్వం నయా ఆలోచన..

కరోనా వైరస్ నియంత్రణ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ మహమ్మారిని నియంత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్ ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం..ఆ సమాచారం మొత్తం నిక్షిప్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు దేశీయంగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని హోమ్ క్వారంటైన్ చేసిన ప్రభుత్వం వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచింది. ఇందుకోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాప్ ను ఉపయోగిస్తోంది. 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారి పై ఆంక్షలు తొలగిస్తుంది.

హోమ్ క్వారంటైన్ చేసిన వేలాది మంది పై ప్రత్యేక నిఘా పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ప్రక్రియ విజయవంతం కావడంతో ఆ విధానాన్ని రెడ్ జోన్, హాట్ స్పాట్ లపై కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెడ్ జోన్ ప్రజలపై ప్రత్యేక నిఘా పెట్టేందుకు సరికొత్త యాప్ ను రూపొందించాలని రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ యాప్ వివరాలను వెల్లడించారు. త్వరలోనే యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని డిజిపి వెల్లడించారు. తద్వారా రెడ్ జోన్ లపై కరోనా వైరస్ ను కట్టడి చేస్తామని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.

సమర్థవంతమైన యంత్రాంగం వ్యవస్థ ఉండటంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా సంబంధిత సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని కరోనా వైరస్ ప్రభావం ఆధారంగా మూడు జోన్లుగా విభజించింది. వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను రెడ్ జోన్లు గా, తక్కువ కేసులు ఉన్న ప్రాంతాలను ఆరంజ్ జోన్లుగా, ఎలాంటి ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా మండలాల వారీగా విభజించింది. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచి లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు లు ఇచ్చింది. రెడ్ జోన్లు, హాట్ స్పాట్ లు మినహా మిగతా ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, నిర్మాణ రంగాలు,ఎలక్ట్రికల్ షాప్లు, బుక్ స్టాల్స్ తదితర రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. మే మూడో తేదీ తర్వాత లాక్ డౌన్ గడువు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ జోన్ లో ఉన్న మండలాలకు లాక్ డౌన్ నుంచి ఎక్కువగా మినహాయింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Show comments