iDreamPost
android-app
ios-app

విశాఖ భూ కుంభకోణం లో కదలిక.. సీఎం జగన్ కు సిట్ మధ్యంతర నివేదిక

విశాఖ భూ కుంభకోణం లో కదలిక.. సీఎం జగన్ కు సిట్ మధ్యంతర నివేదిక

టిడిపి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ అక్రమాలపై మధ్యంతర నివేదికను సిట్ అధికారులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు. ఈ మేరకు సిట్‌ ఛైర్మన్‌ డా. విజయ్‌కుమార్‌, సభ్యులు అనురాధ, భాస్కర్‌రావు గురువారం అమరావతిలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మొత్తం 1351 ఫిర్యాదులు ఉన్నట్లు తాము గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. భూఅక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినట్లు గుర్తించినట్లు, ఆ అంశాలను నివేదకలో పొందుపర్చినట్లు అధికారులు చెప్పారు. ఈ అక్రమాల్లో ఐఏఎస్‌ అధికారుల నుంచి కింది స్థాయి అధికారులు వరకు ఉన్నట్లు వారు తెలిపారు.

ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశాలు ఉన్నాయని వారు సీఎంకు వివరించారు. ఈ నెల 31తో సిట్‌ గడువు ముగియనుంది. దీంతో గడువు పొడిగించాలని వారు సీఎంను కోరగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్రమాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని సిట్‌ అధికారులకు సీఎం సూచించారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విశాఖ లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో విద్యా శాఖ మంత్రిగా ఉన్న విశాఖ నేత గంటా శ్రీనివాస రావు పై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ, ప్రయివేట్ భూములు దాదాపు లక్ష ఎకరాలు కబ్జాకు గురయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కలసికట్టుగా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్న ప్రాత్రుడు కూడా భూ కుంభకోణం పై అప్పట్లో ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. బయట నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు విశాఖలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పరోక్షంగా గంటాను ఉద్దేశించి ఆరోపణలు చేశారు.

విశాఖ భూ అక్రమాలపై విచారణ కోసం చంద్రబాబు నాయుడు హయాంలోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రిపోర్టును నాటి సీఎం బాబుకు సమర్పించినా.. అది బయటకు రాలేదు. ఈ అంశంలో చంద్రబాబు తనయుడు అప్పటి మంత్రి నారా లోకేష్ కలుగజేసుకోవడంతో కుంభకోణం వ్యవహారం తెరవెనుకకు వెళ్ళింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబర్ 18న రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో మరోసారి సిట్‌ ఏర్పాటైంది. తాజాగా సిట్ మధ్యంతర నివేదిక ఇవ్వడం తో ఈ వ్యవహారం కేంద్రంగా ఏపీ రాజకీయాలు కొద్దీ రోజులు నడవనున్నాయి.