Idream media
Idream media
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను తేల్చేందు వైఎస్సార్‌సీపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలోని సిట్ మొదట అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఫోకస్ పెట్టింది. అమరావతిలో జరిగిన భు కుంభకోణాలపై ఇటీవల వరకూ చర్చ జరిగిన నేపథ్యం.. ప్రభుత్వమే అక్రమాలు జరిగాయని చెప్పిన పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసమే సిట్ మొదట అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై దృష్టిపెట్టినట్లుంది.
విచారణలో భాగంగా సిట్ అధికారులు ఇప్పటికే కొంత సమాచారం ఉన్న వారిపై ఫోకస్ చేశారు. సీఐడీ ఇచ్చిన అధారాల ప్రకారం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూ వ్యవహారాలను ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఉంటున్న ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుడు, మరో బిల్డర్, పుల్లారావు సన్నిహితుడి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ప్రత్తిపాటికి వీరు బినామీలుగా వ్యవహారించారని సిట్ అనుమానిస్తోంది. ఆ దిశగానే వారిని ప్రశ్నించారని సమాచారం. కీలకమైన ఆధారాలు కూడా సేకరించారని తెలిసింది.
సిట్ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు, వారికి బినామీలుగా వ్యవహరించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు, ఎవరి ఇళ్లలో సోదాలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా బినామీలు హడలిపోతున్నారు. అమరావతిలో 2014 జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో దాదాపు 4070 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోనే 797 మంది తెల్లరేషన్‌కార్డుదారులు భూములు కొనుగోలు చేశారని వెల్లడైంది. ఇప్పుడు వీరందిరూ సిట్ విచారణనను ఎదుర్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రత్తిపాటి అక్రమాలపై దృష్టి పెట్టిన సిట్ ఆ తర్వాత ఎవరిపై ఫోకస్ చేస్తుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.