Idream media
Idream media
కరోనా వైరస్ నివారణకు లాక్‌డౌన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నిత్యవసర సరుకులు విక్రయించే దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్రం లాక్‌డౌన్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జగన్ సర్కార్ లాక్‌డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా కూరగాయలు, నిత్యవసర వస్తువలు, మందుల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే నిత్యవసర, కూరగాయల దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రకటించింది. అయితే సరుకుల సాకుతో పలువురు అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో దుకాణాలు తెరిచి ఉంచే సమయం తగ్గించింది. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఆయా దుకాణాలు అందుబాటులో ఉండనున్నాయి.
లాక్‌డౌన్ నేపథ్యంలో కొంత మంది వ్యాపారులు నిత్యవసర వస్తువుల ధరలు కృత్రిమంగా పెంచి సొమ్ముచేసుకునే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎవరైనా నిత్యవసర వస్తువల ధరలు పెంచి విక్రయిస్తే దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని, జైళ్లకు పంపిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. లాక్‌డౌన్ ప్రకటించే సమయంలో సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రి నంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ మేరకు 1902 టోల్ ఫ్రి నంబర్‌ను తాజాగా ఏర్పాటు చేశారు. ఎవరైనా ధరలు పెంచి విక్రయిస్తే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని మంత్రి పేర్ని నాని చెప్పారు.