సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, తొలితరం జర్నలిస్టులలో ఒకరైన పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయర ఇవాళ ఉదయం హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు.

పత్రికారంగానికి 50 ఏళ్లకు పైగా సేవలందించిన పొత్తూరి తెలుగు జర్నలిజంలో తనదైన ముద్రలు వేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సేవలందించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తి ప్రారంభించిన ఆయన ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేసారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరుతో పుస్తకం రచించారు. అదేవిధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పీవీ గురించి రాసిన ‘ఇయర్‌ ఆఫ్‌ పవర్‌’కు సహ రచయితగానూ పొత్తూరి పనిచేశారు. తెలుగు పత్రికా సంపాదకునిగా, ఏపీ ప్రెస్ అకాడమీ అధ్యక్షునిగా పలు హోదాలలో పనిచేశారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికలలో సంపాదకులుగా చాలాకాలం పనిచేశారు.

తాను చిన్నస్థాయినుంచి ప్రారంభమై తాను పనిచేసే రంగంలో నిష్ణాతులై పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పొత్తూరి స్వస్థలం గుంటూరు జిల్లాలోని పొత్తూరు.. 1934 ఫిబ్రవరి 8న జన్మించారు. ఇక, పొత్తూరి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొత్తూరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువలేమని, పేర్కొన్నారు. దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శప్రాయులన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన.. ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారని జగన్ గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పొత్తూరి మృతిపట్ల తన సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పొత్తూరి మరణం తీరని లోటని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జర్నలిజంలో ఆయన పితామహుడని కొనియాడారు. ఆయన మరణంతో ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు తమ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Show comments