iDreamPost
iDreamPost
మాములుగా మనకు సంక్రాంతి అంటే భారీ సినిమాలు, కోట్లలో కలెక్షన్లు, పెద్ద హీరోల పోటీని ఎక్కువగా చూస్తాం. ఇది ఎన్నో ఏళ్ళుగా ఒక సంప్రదాయంలా వస్తున్నదే. కానీ దానికి భిన్నంగా స్టార్ హీరోలవి డిజాస్టర్ కావడం, ఎలాంటి అంచనాలు లేని చిన్న చిత్రాలు గొప్ప విజయాలు అందుకోవడం అరుదుగా జరుగుతుంది. దానికి వేదికగా నిలిచింది 1991 సంక్రాంతి. ఆ విశేషాలు చూద్దాం. ఆ ఏడాది ముందుగా వచ్చింది చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ డ్రామా 9న విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అత్యున్నత టీమ్, తారాగణం పని చేసినా ప్రయోజనం లేకపోయింది.
11న జగపతిబాబు పందిరిమంచం సైతం ఫ్లాప్ కొట్టింది. అప్పటికి తనకు ఇంకా ఇమేజ్ రాని రోజులవి. కానీ అదే రోజు రెండు అద్భుతాలు జరిగాయి. మొదటిది ప్రేమఖైది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ కొట్టింది. రాజన్ నాగేంద్ర పాటలు, హరీష్-మాలాశ్రీ జంట, మంచి కథాకథనాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఫలితంగా వంద రోజుల బొమ్మగా నిలిచిపోయింది. ఇక రెండోది సీతారామయ్య గారి మనవరాలు. క్రాంతి కుమార్ దర్శకత్వంలో వి దొరస్వామిరాజు నిర్మించిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు విగ్గు లేకుండా నిజమైన బట్టతలతో తాత పాత్రలో కనిపించారు.
స్టార్ జంట లేకపోయినా పుష్కలమైన సెంటిమెంట్, కీరవాణి మధురమైన బాణీలు, జీవితకాలం గుర్తుండిపోయే మీనా నటన వెరసి దీన్ని సిల్వర్ జూబ్లీ దాకా పరుగులు పెట్టించాయి. అవార్డులు రివార్డులే కాదు కలెక్షన్ల వర్షాలు కురిపించాయి. సినిమా స్కోప్ ట్రెండ్ లోనూ ప్రేమఖైది, సీతారామయ్య గారి మనవరాలు రెండూ 35 ఎంఎంలోనే రూపొందటం విశేషం. ఆ తర్వాత 13న వచ్చిన ఉషాకిరణ్ మూవీస్ అమ్మకు ప్రశంసలు దక్కగా, 18న రిలీజైన కృష్ణ పరమశివుడు ఫ్లాప్ గా మిగిలింది. వీటికన్నా చాలా ముందు జనవరి 2న వెంకటేష్ శత్రువు సూపర్ హిట్ కావడం మర్చిపోకూడదు. మరుసటి రోజు అంటే 3న వచ్చిన స్టువర్ట్ పురం దొంగలు కూడా కమర్షియల్ గా పాస్ అయ్యింది. కాకపోతే పది రోజుల గ్యాప్ ఉంది కాబట్టి వీటిని 1991 సంక్రాంతి లిస్టులో చేర్చలేదు
Also Read : Police Story : డబ్బింగ్ ఆర్టిస్ట్ ని హీరో చేసిన బ్లాక్ బస్టర్ – Nostalgia