iDreamPost
iDreamPost
క్రియేటివిటీ ఫ్యాక్టర్ ఎంత ఉన్నా, నటీనటుల సపోర్ట్ ఎంత బలంగా నిలిచినా కంటెంట్ అన్ని వర్గాలను మెప్పించలేకపోతే ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. దానికి గొప్ప దర్శకులు సైతం ఎన్నో మంచి ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పటి జెనరేషన్ చప్పట్లు కొట్టేలా ‘సఖి’ తీసిన మణిరత్నమే ఇదేం సినిమారా బాబు అనుకునేలా ‘కడలి’ తీశారు. కొన్నిసార్లు ఇలాంటివి జరగడం సహజం. కొన్ని సార్లు బ్రాండ్ పనిచేయదు. ఓ ఉదాహరణ చూద్దాం. 1995లో డెబ్యూ మూవీ ‘గులాబీ’తోనే సెన్సేషనల్ డెబ్యూ చేసిన కృష్ణవంశీ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’ రూపంలో నాగార్జున లాంటి పెద్ద స్టార్ హీరోని డీల్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో చాటారు.
ఆపై స్వంత బ్యానర్ పై తీసిన ‘సిందూరం’, మళ్ళీ నాగ్ తో కాంబో అయిన ‘చంద్రలేఖ’ నిరాశపరిచినప్పటికీ కృష్ణవంశీలోని ఒరిజినల్ క్రియేటర్ 1998లో వచ్చిన ‘అంతఃపురం’తో బయటికి వచ్చాడు. సీమ ఫ్యాక్షన్ ని స్టైలిష్ గా చూపించిన తీరు సూపర్ హిట్ అందుకుంది. అందులో చివరి అరగంట మాత్రమే కనిపించే జగపతిబాబు క్యారెక్టర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ టైంలోనే తనతో ఫుల్ లెన్త్ మూవీకి ప్లాన్ చేసుకున్నారు కృష్ణవంశీ. అమ్మా చెల్లితో సరదాగా జీవితం గడుపుతున్న ఓ యువకుడి మీద పోలీస్ ఆఫీసర్ హత్య కేసు మీద పడుతుంది. అతను తప్పించుకుని ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే పాయింట్ తో సముద్రం కథ రాసుకున్నారు
శ్రీహరికు ఒక ప్రత్యేకమైన మ్యానరిజం సెట్ చేశారు. తనికెళ్ళ భరణి విలన్ గా, ఆయన బుద్దులు పుణికిపుచ్చుకున్న కొడుగ్గా రవితేజ, పైకి కనిపించని కన్నింగ్ కానిస్టేబుల్ గా శివాజీరాజా, అమాయక పోలీస్ గా ప్రకాష్ రాజ్ ఇలా క్యారెక్టరైజేషన్లలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కృష్ణవంశీ కథనం విషయంలో తడబడటంతో సముద్రం భారీ అంచనాలు అందుకోలేకపోయింది. అయినా కూడా యావరేజ్ గా నిలవడానికి కారణం ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో పాటు తనకు మాత్రమే సాధ్యమైన కృష్ణవంశీ టేకింగ్. శశిప్రీతం సంగీతం పర్వాలేదనిపించుకుంది. ఉత్తమ విలన్, ఆడియోగ్రాఫర్ రెండు విభాగాల్లో సముద్రం నంది అవార్డులు గెలుచుకుంది. 1999 అక్టోబర్ 22 రిలీజైన సముద్రం కమర్షియల్ గా వర్కౌట్ కానప్పటికీ ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోయింది
Also Read : కనిపించని ప్రేమకు ప్రేక్షకులు ఫిదా – Nostalgia