టిడిపికి మరీ ఇంత అత్యాశా ? జమిలి ఎన్నికలట ?

’మరో రెండేళ్ళల్లో జరగబోయే జమిలి ఎన్నికల్లో వైసిపి ఓటమి ఖాయం. మళ్ళీ విజన్ ఉన్న నేతే ముఖ్యమంత్రి అవ్వటం అంతకన్నా ఖాయం’.. ఇది టిడిపి నేతల తాజా వ్యాఖ్యలు. విజన్ ఉన్న నేతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంటే చంద్రబాబునాయుడు తప్ప మరో నేత కాదన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. మాజీ ఎంపి, టిడిపి నేత సబ్బం హరి తదితరులు మాట్లాడుతూ 2022కల్లా దేశంలో జమిలి ఎన్నికలు వచ్చేయటం ఖాయమని జోస్యం చెప్పేస్తున్నారు. ఆ ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని, చంద్రబాబు సిఎం అయిపోతాడని భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఇక్కడ రెండు పాయింట్లు మాట్లాడుకోవాలి. అదేమిటంటే అసలు జమిలి ఎన్నికలు సాధ్యమేనా ? ఇక రెండో పాయింట్ ఏమిటంటే ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగినా టిడిపికి అధికారంలోకి వచ్చేంత సీన్ ఉందా ? మొదటి పాయింటే తీసుకుంటే అప్పుడెప్పుడో జమిలి ఎన్నికలు జరిగితే బాగుంటుందని నరేంద్రమోడి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇదే విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎన్నికల కమీషన్ కూడా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. మేధావులతో మాట్లాడింది. అంతా అయిన తర్వాత ఎన్నికల సంఘం స్వయంగా చేసిన ప్రకటన ఏమిటంటే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.

ఎప్పుడైతే ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసిందో అప్పటి నుండి మోడినే జమిలి ఎన్నికల ఊసెత్తటం మానేశాడు. అలాంటిది చంద్రబాబు, సబ్బంహరి లాంటి వాళ్ళు మాత్రమే ఇంకా జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అర్జంటుగా జగన్ పదవిలో నుండి దిగిపోవాలి. అంతే అర్జంటుగా తాను సిఎం కుర్చీలో కూర్చోవాలనే ఆతృత చంద్రబాబులో పెరిగిపోతోంది. 151 సీట్ల అఖండ మెజారిటిని వైసిపికి అందించిన జనాలు ఇంతలోనే చంద్రబాబుకు ఎందుకు పట్టం కడతారనేది సింపుల్ లాజిక్. జనాలందరూ జగన్ పాలనపై విపరీతమైన వ్యతిరేకతతో ఉన్నారన్నది సబ్బం లాజిక్.

వ్యతిరేకత ఎందుకు వచ్చింది ? అన్నది మాత్రం సబ్బం చెప్పటం లేదు.

అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్ గా అర్ధమవుతున్నదేమంటే జనాల్లో జగన్ పాలనపై వ్యతిరేకత పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ బాధ్యతను గడచిన ఏడాదిగా ఎల్లోమీడియా నిర్వర్తిస్తునే ఉంది. అయితే ఎల్లోమీడియాను జనాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని చంద్రబాబు, ఎల్లోమీడియా అధిపతులు, సబ్బం లాంటి నేతలకే ఇంకా అర్ధంకాలేదు.

Show comments