2022 రివ్యూ 6 – మురిపించిన బ్లాక్ బస్టర్లు

కరోనా మహమ్మారితో రెండేళ్లు అల్లాడిపోయిన పరిశ్రమకు చక్కని ఊరట కలిగించింది 2022. ఆ విజయాల తాలూకు జ్ఞాపకాలు ఏంటో చూద్దాం. ‘ఆర్ఆర్ఆర్’ 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో మన దేశంలోనే కాదు జపాన్ లాంటి కంట్రీస్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టించి రాజమౌళి మాయాజాలాన్ని ఆస్కార్ మెట్ల వరకు తీసుకెళ్లింది. గెలుపు దక్కలేది లేనిది ఇంకో రెండు నెలల్లో తేలనుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. దుల్కర్ సల్మాన్ లాంటి పరభాషా నటుడితో ‘సీతారామం’ లాంటి విజువల్ వండర్ ని ఆవిష్కరించడం ఒక ఎత్తయితే దానికి 90 కోట్లకు గ్రాస్ రాబట్టడం దర్శకుడు హను రాఘవపూడి టాలెంట్

అర్జున్ సురవరం తర్వాత రెండేళ్ల గ్యాప్ వచ్చిన నిఖిల్ కు ‘కార్తికేయ 2’ కెరీర్ బెస్ట్ జ్ఞాపకాలను ఇచ్చింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ కూ భారీ స్పందన రావడం, కృష్ణుడి సెంటిమెంట్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయిపోయి 120 కోట్లకు పైగా వసూలు చేయడం మర్చిపోలేని విజయం. అడవి శేష్ కి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ‘మేజర్’కు ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా యునానిమస్ రెస్పాన్స్ దక్కింది. ‘హిట్ 2’ సైతం టైటిల్ కు తగ్గట్టు అనూహ్య ఫలితాన్ని అందుకోవడం తనకు జరిగిన మరో ప్లస్సు. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చినా లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా సూపర్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డకు ‘డీజే టిల్లు’ ఇచ్చిన సక్సెస్ కిక్కు ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది

రెండేళ్లుగా కనీసం యావరేజ్ లేక బాధపడుతున్న శర్వానంద్ కు ‘ఒకే ఒకే జీవితం’ ఊరట కలిగించింది. కొత్త దర్శకుడు శ్రీకార్తిక్ కి ఇచ్చిన బాధ్యత సంపూర్ణంగా నెరవేరింది. కళ్యాణ్ రామ్ సైతం ఇదే స్టేజిలో ఉంటే దర్శకుడు వశిష్ఠ ఇచ్చిన ‘బింబిసార’ పరిశ్రమలో అందరూ మాట్లాడుకునేలా చేసింది. తక్కువ బిజినెస్ టార్గెట్ తో అనారోగ్యం కారణాల వల్ల హీరోయిన్ సమంత ప్రమోషన్లకు హాజరు కాలేకపోయినా ‘యశోద’ కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. ఇంకో వారంలో ఏడాది ముగుస్తుండగా రవితేజ ‘ధమాకా’ సైతం టాక్ రివ్యూలకు భిన్నంగా కమర్షియల్ గా దూసుకుపోవడం శుభసంకేతం. ఇదే తరహా ఫలితాలు ఇంతకన్నా మెరుగ్గా 2023లో వస్తాయని ఆశిద్దాం

Show comments