చంద్రబాబు అప్పుచేసి పప్పుకూడు తినలేదా ? .. నిన్నటి ఆంధ్రజ్యోతిలో వార్తే సాక్ష్యం

ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోలో పేరుతో దాని యజమాని వేమూరి రాధాకృష్ణ రాసే కొత్తపలుకులో విచిత్రమైన సామెతను ఉపయోగించాడు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏడాది కాలంలో ఏమి జరిగందంటే అప్పు చేసి పప్పుకూడు తింటున్నట్లు చెప్పాడు. అభివృద్ధి కార్యక్రమాలను జగన్ గాలికొదిలేసి కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రం అమలు చేస్తున్నాడట. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా జనాలకు దగ్గరవ్వటానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలతో జనాలందరూ జేజేలు కొడుతున్నారంటూ తెగ బాధపడిపోయాడు.

సరే రాధాకృష్ణ చెప్పిందే నిజమని అనుకుందాం కాసేపు. మరి ఎంతో అనుభవజ్ఞుడు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన హయాంలో చేసిందేమిటి ? ఐదేళ్ళల్లో చంద్రబాబు చేసిన అప్పుల మాటేమిటి ? ఇదే ఆంధ్రజ్యోతిలో శనివారం పత్రికలో మొదటి పేజీలో చంద్రబాబునాయుడు హయాంలో రాష్ట్రంలో అప్పులు 2.7 లక్షల కోట్లున్నట్లు చెప్పటాన్ని మరచిపోయాడేమో. మరి రూ. 2.7 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు ఆ అప్పులతో ఏమి చేశాడో రాధాకృష్ణ చెప్పగలడా ?

ఒక్క ఇరిగేషన్ పథకమైనా పూర్తిచేశాడా ? పట్టిసీమను తానే కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు అందులో జరిగిన అవినీతి గురించి ఏమి సమాధానం చెబుతాడు ? పట్టిసీమ పథకంలో భారీ అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ ఇచ్చిన నివేదికను చంద్రబాబు ఓ చిత్తు కాగితంతో పోల్చలేదా ? పట్టిసీమ తప్ప చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రాజెక్టును మరోటి చెప్పగలడా ? ప్రతి ప్రాజెక్టు అంచనాలు పెంచేసి భారీగా దోచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు ఏనాడైనా సమాధానాలు చెప్పాడా ? అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న బిజెపి నేతలే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో టిడిపి వేలాది కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నట్లు రాయలసీమ ప్రాజెక్టులపై కేంద్రానికి నివేదిక ఇచ్చింది వాస్తవం కాదా ?

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు అప్పులు చేసి ప్రాజెక్టులని, అమరావతి నిర్మాణమని ఇలా ఏదో ఓ పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు. చంద్రబాబు అమలు చేశానని చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలకు కూడా అప్పులే ఆధారం. కాకపోతే ఇటు ప్రాజెక్టుల్లోను దోచేసుకుని, అటు సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అమలు చేయకపోవటం వల్లే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి జనాలు గూబగుయ్యిమనిపించిన విషయాన్ని రాధాకృష్ణ మరచిపోయాడేమో.

జగన్ సంక్షేమపథకాలపైనే మాత్రమే దృష్టి పెట్టాడని చెప్పటం కూడా అబద్ధమే. పోలవరం ప్రాజెక్టు తదితరాల్లో రివర్స్ టెండరింగ్ ను అమలు చేయటం ద్వారా జగన్ అవినీతిని అరికట్టింది వాస్తవం కాదా ? ప్రాజెక్టుల పనులు కూడా మొదలైంది. కరోనా వైరస్ సంక్షోభం లేకపోతే పోలవరంతో పాటు చాలా ప్రాజెక్టుల్లో పనులు ఊపందుకునుండేవే అనటంలో సందేహం లేదు. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేయాల్సిందే. అప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ వస్తాయనటంలో సందేహం లేదు.

అంతేకానీ జగన్ చేస్తున్నదంతా తప్పే చంద్రబాబు ఏమి చేసినా ఒప్పే అంటున్న కారణంగానే ఎల్లోమీడియా పాఠకుల ఆధరణ కోల్పోతోందని తెలుసుకుంటే మంచిది.

Show comments