కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లాక్డౌన్ ప్రకటించున్నారు. మన దేశం కూడా స్తంభించిపోయుంది. పాఠశాలలు, కళాశాలలు పరీక్షల్ని కూడా రద్దు చేసి/వాయిదా వేయడంతో చదువుకునేవాళ్ళు; ఉద్యోగులు సాధ్యమైనంత మంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ఆ వెసులుబాటు లేని వారు లాక్డౌన్ తొలి దశ సడలింపుల తర్వాత కొందరు తమ విధులు నిర్వహిస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే సోమవారం నుంచి శుక్రవారం/శనివారం దాకా తమ పనుల్లో తీరిక లేని వారు, చిన్న పిల్లలు ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ రోజు ఒకేలా ఉంటోంది కనుక ఆదివారం కోసం ‘ఆంధ్రజ్యోతి’ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) తప్ప దేశంలో ఎవరూ ఎదురుచూస్తున్నట్టు లేరు.
ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, తన పలుకుల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి(జగన్) మీద ఎలా బురద జల్లాలా అని ప్రతీ సోమవారం నుంచే ఆర్కే ఎదురుచూస్తున్నట్టుగా తన ‘కొత్తపలుకు’ చదివేవారెవరికైనా అనిపిస్తుంది. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన మీద వ్యతిరేకత తీసుకురావడమనే ఏకైక ధ్యేయంతో ముందుకుపోతున్న ఆర్కే ప్రతీ ఆదివారం లాగే ఈ రోజు కూడా తన లక్ష్యసాధనకే కట్టుబడ్డారు.
జగన్ రాజకీయంగా పార్టీని బలపరుచుకుంటున్న తీరు మొత్తానికి ‘సత్ఫలితాలిస్తోంద’న్న బాధను ఆర్కే పరోక్షంగా బయటపెట్టినప్పటికీ జగన్ అనుసరిస్తున్న ‘మోడల్’కు కుల, మత, ప్రాంత కోణాలు అంటగట్టడానికి తన శాయాశక్తుల కృషి చేశారు. ఆ కృషిలో భాగంగా 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(వైఎస్సార్) ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎన్నడూ లేనంతగా వైఎస్సార్ ను కొనియాడారు కూడా. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్కరి పట్ల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వివక్ష చూపలేదని, ఏ ఒక్క వర్గం పైన కక్షపూరితంగా వ్యవహరించలేదని, వివిధవర్గాల వారిని పారిశ్రామికంగా, ఆర్ధికంగా ప్రోత్సహించారని చెప్పారు.
బహుశా వైఎస్సార్ పదవిలో ఉండగా “ఏదో ‘ఈనాడు’ పేపర్ లార్జెస్ట్ సర్కులేటడ్ డైలీ కనుక చదవాల్సి వస్తోంది కానీ ఆంధ్రజ్యోతి పేపర్ అయితే అసలు చదవడమే మానేశాను” అని అసెంబ్లీలో స్వయంగా తానే చెప్పే స్థాయిలో వైఎస్సార్ మీద రాతలు రాసిన విషయాలు ప్రజల జ్ఞాపకంలో నుంచి చెరిగిపోయుంటాయని ఆర్కే నమ్మకం కాబోలు. ఆర్కే అప్పుడు రాసినవి నిజాలనుకోవాలా, లేక ఇప్పుడు రాసినవా ?! అదీ గాక ఆయన ఎప్పుడు, ఏం రాస్తే పాఠకులు అప్పుడు, అదే నిజమని నమ్మాలని ఆశిస్తున్నారా ?
ఇక “ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు”; “రాష్ట్ర విభజన పుణ్యమా అని 2014 లో ముఖ్యమంత్రి అయిన” చంద్రబాబు పాలన గురించి గొప్పగా చేప్పేందుకు పదాల గారడీతో ఎంత ప్రయత్నించినా నిజాలు బయటపెట్టకుండా ఉండలేకపోయారు. గతంలో వచ్చిన విమర్శల్ని అధిగమించడానికి ఎమ్మెల్యేలను పూర్తిగా వదిలేశార”ట. అవినీతి చేయడానికి ఎమ్మెల్యేలకు అనుమతిచ్చి ప్రజల మీదకు వదిలేశారని ఆర్కే ఉద్దేశమా ? అందుకే ఎన్నికల ముందు “ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చూసి కాదు, నన్ను చూసి ఓటేయండి” అని వంగి వంగి దండాలు పెట్టి మరీ అడిగే పరిస్థితి తెచ్చుకున్నారా ?
పాపం చంద్రబాబు గారు ప్రజల కోసం కష్టపడి పని చేసే క్రమంలో ‘విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కులం అనేది ప్రధాన సమస్యగా ఉందని’ గుర్తించలేకపోయారట. అందుకే కాబోలు – ‘రాజ్యాంగంలో లేని ఒక పదవి'(2019 డిసెంబర్ 1న ఆర్కేనే ఈ మాట అన్నారు) ని ఎరగా చూపుతూ “రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు – ఒకటి బీసీకి, మరొకటి కాపుకి” అంటూ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు సెలవిచ్చారు. కుల సమీకరణల లెక్కలతో టికెట్లు, పదవుల పందేరాలు, కులాల వారీగా వరాల ప్రకటనలు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారంటూ ప్రశ్నార్ధక వ్యాఖ్యలు, అవతల పార్టీల్లో ఏ కులం వారి పై విమర్శల దాడికి తమ పార్టీలోని ఆ కులం వారినే మోహరించడం వంటి ఒక కొత్త ‘మోడల్’ తీసుకొచ్చిన ‘అనుభవజ్ఞులు’ ఎవరో లోకవిదితమే. చంద్రబాబు ఓటమికి ఆయన తప్ప ఎమ్మెల్యేల నుంచి అధికారుల వరకు ఎవరో ఒకరిని కారకులుగా చూపేందుకు; ‘చంద్రబాబు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసేసినా ఓటేయలేదం’టూ ప్రజానిర్ణయాన్ని కూడా తప్పు పట్టేందుకు ఆర్కే పడ్డ కష్టం, తాపత్రయం చూస్తే ఎవరికైనా జాలి కలగకమానదు.
అఖండ మెజారిటీ తో జగన్ సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేక – కేవలం కమ్మ సామాజికవర్గం మీద ఇతర కులాల్లో తీసుకొచ్చిన వ్యతిరేకతే అందుకు కారణమని; ఎంత చేసినా కమ్మ సామాజికవర్గం తనకు ఓటేయదని జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తున్నాడని; వీలైనన్నిసార్లు సామాజికవర్గ ప్రస్తావన తీసుకొచ్చి ‘పలికి’న ఆర్కే కొత్త రకమైన కుల రాజకీయానికి తెరలేపారు. అదేంటంటే జగన్ కాపుల్ని కూడా దూరం పెట్టడానికి చూస్తున్నాడని; అందుకే కల్యాణ్, నాగబాబు, కన్నా లక్ష్మీనారాయణ వంటి నాయకుల్ని టార్గెట్ చేసుకున్నారని తద్వారా మిగిలిన వర్గాలను తన వైపు తిప్పుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆయన పేర్కొన్న ముగ్గురూ ఆ సామాజికవర్గానికి ప్రతినిధులని ఆర్కే అభిప్రాయమా ?! వంగవీటి రంగా హత్యానంతరం రాజశేఖర్ రెడ్డి రంగంలోకి దిగి కాపులకు అండగా నిలిచాడు కనుకనే కాపులందరూ చివరి వరకు ఆయన వెంట నిలిచారని చెప్పిన ఆర్కే – అసలు ‘రాజకీయమే తెలియని నిష్కల్మషమైన నేత’ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం కాపు సామాజికవర్గానికి ఒకరు అండగా నిలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది ? అనే విషయాలు మాత్రం చెప్పలేదు. జనాభా పరంగా ఎక్కువ మంది ఉన్న కాపుల్ని జగన్ నుంచి దూరం చేసేందుకే ఆర్కే చేస్తున్న ఈ ప్రయత్నాల్ని ఎవరైనా అర్ధం చేసుకుంటారు.
మద్యం ధరల పెంపు, అన్ని బ్రాండ్లు లభ్యమవ్వకపోవడం గురించి రాస్తూ – ప్రతిపక్షాలు వాటిని గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితిని జగన్ కల్పించాడనే ఉక్రోషం ఆయన రాతల్లో కనిపిస్తోందే తప్ప, మద్యనిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం రోజుల్లో 43000 బెల్టు షాపుల్ని మూయించిందని; వైన్ షాపుల సంఖ్యను, బార్ల సంఖ్యను బాగా తగ్గించిందని; మద్యం అమ్మకాలు తగ్గిపోయాయని అధికారిక లెక్కలతో కూడిన సమాచారం వారి మీడియాలోనే వచ్చినా కూడా అభినందిస్తూ ఒక్క మాట కూడా ‘పలక’లేకపోయారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విషయంలో వ్యతిరేకించిన వారిని “మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారంటూ” అధికార పార్టీ సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రతిపక్షాల వారు స్వరం సవరించుకునే పరిస్థితి కల్పించారంటూ ఆర్కే వాపోయారంటే ప్రభుత్వ నిర్ణయం సరైనదో కాదో పాఠకులకే అర్ధమవుతుంది. విశాఖ గ్యాస్ లీకేజి వ్యవహారంలో “భారీ నష్టపరిహారం ప్రకటించిన జగన్ కు మంచివాడన్న పేరు వచ్చింది కదా ?” అని ప్రశ్నించే బదులు “అవును, వచ్చింది” అని కచ్చితంగా రాయచ్చు కదా, రాయరు. “ఇలాంటి సందర్భాలలో ప్రమాదానికి కారణమైన కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలి” అని ఆర్కే అంటున్నారంటే ఈ విషయం పైన ఎవరైనా కోర్టులకెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోందని ‘అంతర్జాతీయ సమాజం’ భావిస్తోంది.
ఏది ఏమైనా – జగన్ రాజకీయంగా కదుపుతున్న పావులు సత్ఫలితాల్ని ఇస్తున్నాయి, ప్రవేశ పెట్టిన పథకాలన్నీ బ్రహ్మాండంగా అమలవుతున్నాయి, “చంద్రబాబు అండ్ కో ..” కి ఏం చేయాలో తోచని స్థితిని అధికార పార్టీ విజయవంతంగా కల్పించింది. ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం తిరక్కుండానే ఇన్ని విషయాల్లో జగన్ బలపడిన తీరును ప్రజలు గుర్తించకుండా చేయడానికి బోడిగుండుకు మోకాలికి ముడిపెడుతూ ఆర్కే ఎప్పటిలాగే తన వీకెండ్ కామెంట్ రాశారు. అది ‘వీకెండ్ కామెంట్’ కాదు, ‘వీకెన్డ్ (weakened) కామెంట్’ అయిపోయిందని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో మనం కూడా వేచిచూడాల్సిందే.