iDreamPost
android-app
ios-app

పంత్‌ కథ ముగిసినట్లే.. నా???

పంత్‌ కథ ముగిసినట్లే.. నా???

కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో ఎంఎస్‌ ధోనికి వారసుడిగా అనతి కాలంలోనే మన్ననలు పొందిన రిషభ్‌ పంత్‌కు నేడు గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. లెక్కలు మించి అవకాశాలు పొందిన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో వికెట్‌ను ఇచ్చేస్తుండటంతో తన కెరీర్‌ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ తీవ్రంగా నిరాశ పరుస్తూ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని కోల్పోతున్నాడు. మొన్నటిదాకా పంత్‌ను వెనకేసుకొచ్చిన కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. పరోక్షంగా పంత్‌ లేకపోయినా జట్టుకొచ్చిన నష్టమేమీ లేదని సంకేతాలు ఇస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ రూపంలో పంత్‌కు కీపింగ్‌ స్థానానికి, జట్టులో చోటుకు ఇబ్బందులు తప్పవని స్పష్టమవుతోంది.

Read Also: రాణించిన రాహుల్… రెండో టీ20లో భారత్ ఘన విజయం

ఇటీవల కోహ్లి మాట్లాడుతూ.. కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్, బ్యాటింగ్‌ వల్ల జట్టులో మరో అదనపు బ్యాటింగ్‌ స్థానం కలిసొస్తుందని చెప్పుకొచ్చారు.  హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ.. పంత్‌ నేచురల్‌ కీపర్‌ కాదంటూ చెప్పడంతో జట్టులో అతని స్థానంపై సందేహాలు మొదలయ్యాయి. పంత్‌ తన ఆటను, కీపింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే అతని టాలెంట్‌ వృథా అవుతుందని వ్యాఖ్యానించారు. రానున్న టీ20 ప్రపంచ కప్‌ జట్టులో పంత్‌కు స్థానం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా ఇచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోకపోతే ఎవరికైనా ఇబ్బందులు తప్పవని పంత్‌ ఉదంతం తెలియజేస్తోంది.

టీమిండియాలో చోటు కోసం ఎంతో మంది టాలెంటెడ్‌ క్రికెటర్లు ఎదురుచూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారి జట్టులో స్థానం కోల్పోతే మళ్లీ పొందే అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించక తప్పదు. వన్డేల్లో, టీ20ల్లో జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలగడంతోపాటు కీపింగ్‌ను సమర్థంగా నిర్వహిస్తున్న కేఎల్‌ రాహుల్‌ జట్టు మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పంత్‌కు గాయం కావడంతో అతని స్థానంలో కీపింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ తన సత్తా చూపాడు కేఎల్‌ రాహుల్‌. ప్రస్తుతం న్యూజిలాంగ్‌ గడ్డపై టీ20ల్లో వరస అర్ధశతకాలు సాధించి జోరుమీదున్నాడు. ఇదే ఆటతీరు న్యూజిలాండ్‌ పర్యటన మొత్తం  కొనసాగితే రాహుల్‌ జట్టులో పర్మినెంట్‌ ఆటగాడిగా మారతాడనడంలో సందేహం లేదు.