ఒక్కరోజులో 14,516 పాజిటివ్ కేసులు-375 మరణాలు
కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 12 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 14,516 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. ఇప్పటివరకూ నిర్దారణ అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం,. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,95,048 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 14,516 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 375 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ బారినుండి 2,13,830 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,68,269 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో 3,827 కరోనా కేసుల నమోదు
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 3827 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,24,331 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 5,893 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 62,875 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 3311 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 499 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 6526 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2976 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 3352 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 198 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 465 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 7961 మందికి కరోనా సోకగా 96 మంది మృత్యువాత పడ్డారు. 3905 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3960 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 8,765,394 మందికి కోవిడ్ 19 సోకగా 462,681 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 4,627,844 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,297,190 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 121,407 మంది మరణించారు.