iDreamPost
iDreamPost
ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఒక్క ప్రశ్న వేయకపోగా అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబుని భుజాన మోసే ప్రయత్నం చేశారనేది నిర్వివాద అంశం. కానీ ఎన్నికల తరువాత ఆయన తీరులో స్పష్టమైన మార్పు కనిపించడం మొదలైంది.
ఆ మార్పులో అతి ముఖ్యమైంది, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో లోపాలు వెతకడం, పని కట్టుకుని ఆరోపణలు చేస్తూ పసలేని వాదనతో లేని తప్పుని ఎత్తి చూపే ప్రయత్నం చేయడం , దాంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత మూట కట్టుకోవడం జరుగుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ లో వచ్చిన ఈ విపరీత మార్పులతో విసిగి చెందిన జనసేన అతి ముఖ్యమైన నేతల్లో ఒకరైన రాజా రవితేజా కూడా పవన్ కళ్యాణ్ దారి తప్పాడు అని చెప్పి పార్టీ నుండి నిష్క్రమించడంతో పవన్ కళ్యాణ్ వైఖరి పైన ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతూ వచ్చాయి.
ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం తరువాత పవన్ కళ్యాణ్ మనస్తత్వాన్ని నిశితంగ పరిశీలిస్తే రాజా రవితేజ చెప్పినట్టు ఆయనలోని విపరీత ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటమిని పవన్ కళ్యాణ్ రాజకీయ స్పూర్తితో చూడకుండా వ్యక్తిగత అవమానంగా భావించారా అనే అనుమానం కలుగుతుంది. తాను ఎంత ప్రయత్నించినా జగన్ గెలుపుని నిలువరించటంలో విఫలం చెందే సరికి జగన్ పై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారా అనేంతగా ఆయన తన ప్రసంగంలో జగన్ కులం, మతం, ప్రాంతంని ఎత్తి చూపుతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం మొదలు పెట్టారు.
మరోవైపు పార్టీ బలోపేతం చేసుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నించడం మానేసారు. మొక్కుబడిగా ఏదొక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉన్నాను అనే భావన కలిగించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ప్రజల్లో బలం ఉన్న నేతలకు పార్టీ నిర్మాణం బాధ్యతలు ఇవ్వకపోగా సొంత పార్టీ నేతలనే అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. దీంతో ఆ పార్టీలో ఉన్న కొద్దిమందీ ముఖ్య నేతలు తమ దారి చూసుకోవడం మొదలెట్టారు. గెలిచిన ఏకైక శాసన సభ్యుడు రాపాక వర ప్రసాద్ గారే పవన్ కళ్యాణ్ పద్దతి ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ కష్టం అని చెప్పారు . పార్టీ తరుపున గెలిచిన ఏకైక శాసన సభ్యుడినైనా తనతో ఏమీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అని మీడియా ముందు వాపోయారు . ఆ పార్టీకి స్పోక్స్ పర్సన్ గా ఉన్న అద్దేపల్లి శ్రీధర్ కూడా పవన్ కళ్యాణ్ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టి , టీడీపీతో ఉన్న బంధాన్ని బయట పెట్టి పార్టీ నుండి తప్పుకున్నారు. ఇలా సుమారు పది మంది ముఖ్య నేతలు పార్టీ తీరుని పవన్ వ్యవహార శైలిని తప్పు పడుతు జనసేనని వీడారు.
ఇవన్ని ఒక ఎత్తైతే ఇక తాజాగా జనసేన పార్టీ నుండి తప్పుకుంటున్నటు ఆ పార్టీ ముఖ్యనేత వివి లక్ష్మీ నారాయణ ప్రకటించారు . దీంతో ఈ విషయం పై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది. పైకి పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసాను అని చెప్పి మళ్లీ సినిమాలు చేయడం తన నిలకడలేని మనస్తత్వానికి నిదర్శనం అని చెప్పి జేడి పార్టీకి రాజీనామా చేసినా అసలు విషయం వేరే ఉందనే చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్లమెంటు అభ్యర్ధుల్లోకెల్లా అత్యధికంగా 2,88,874 ఓట్లు సాదించిన వ్యక్తిగా నిలిచారు వివి లక్ష్మీ నారాయణ , అధ్యక్షుడి సొంత అన్న నాగబాబు నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్లో సాధించిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఈ మాజీ జేడి సాదించారు .
అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని కూడా గాజువాకలో ఓట్లు సాధించటంలో వెనక్కు నెట్టి, పార్టీ అధినేత కన్న ఎక్కువ ఓట్లు సాధించారు. పవన్ కళ్యాణ్ కి గాజువాకలో 58,238 ఓట్లు వస్తే, అదే గాజువాకలో వివి లక్ష్మీ నారాయణ 68567 ఓట్లు సాదించి అధ్యక్షుడు కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఈ విషయంలో గాజువాక నియోజక వర్గంలో జనసేన అధ్యక్షుడి కన్నా లక్ష్మినారాయణ వ్యక్తిగత ఇమెజే పని చేసిందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
రాజా రవి తేజ చెప్పినట్టు ఎదుటవారి పైచేయిని ఓర్చుకోలేని విధంగా పవన్ కళ్యాణ్ మానసిక స్థితి మారిందనే అభిప్రాయం ప్రస్తుతం చాలా మందిలో కలుగుతుంది. సాదాధారణంగా ఇలా వ్యక్తిగత ప్రతిభను కనబరిచిన వ్యక్తులకు రాజకీయ పార్టీలు అదనపు బాధ్యతలు అప్పచెప్పి ప్రోత్సహిస్తాయి. కానీ ఫలితాలు వచ్చిన రోజు నుండే పవన్ కళ్యాణ్ తన కన్న ఎక్కువ ఓట్లు సాధించిన జేడిని , తాను రెండు చోట్ల ఓడిపోతే గెలిచిన ఏకైక నాయకుడు రాపాకని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. పార్టీలో జరిగిన ముఖ్య కార్యక్రమాలకు సైతం జేడి హాజరు కాకపోవడానికి కారణం అధినేత నుంచి పెరిగిన గ్యాప్ వలనే అనే వాదన ఉంది .
దీనికి ఉదాహరణగా తూర్పు గోదావరి జిల్లా మల్కిపురం మండలం దిండి రిసార్ట్స్ లో జరిగిన రెండు రోజుల జనసేన మేధోమధనం కార్యక్రమానికి వివి లక్ష్మీ నారాయణని పిలవకుండా అవమానించారు అనే వార్త ఆనాడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అలాగే ఇసుక మీద విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో కూడా జే.డి జాడలేదు . కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో సైతం జేడికి చోటు దక్కలేదు. గతంలో పార్టీలో వచ్చిన మార్పుపై జేడి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అధినేతకు నేను అవసరం అనుకున్నంత కాలం నేను పార్టీలోనే ఉంటాను అని చెప్పి తనకి పవన్ కళ్యాణ్ కి మద్య పెరుగుతున్న దూరాన్ని చెప్పకనే చెప్పారు. ప్రతీ విషయంలో తనపై చూపిస్తున్న వివక్షతో అధినేతకు తన అవసరం తీరిపోయింది అని భావించిన జేడి ఇక తాను పార్టీలో ఉండి ఉపయోగం లేదు అని భావించి రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటారనే మాట విశాఖ రాజకీయ వర్గాల్లో వినబడుతుంది .
ఎన్నికల ముందు జేడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పవన్ ఎన్నికల తరువాత నిర్లక్ష్యం చేయడానికి ముఖ్యకారణం శత్రుత్వం మిత్రుత్వం తో సంబంధం లేకుండా పైచేయిని ఓర్చుకొలేని వ్యక్తిగా పవన్ మనస్తత్వం తయారవడమే ముఖ్య కారణం అయి ఉండొచ్చనే వాదన తాజాగా జనసేన పార్టీలోనే వినిపిస్తుంది. నాయకుడిగా రాణించాలంటే పక్కవాడి ప్రతిభను గుర్తించి సముచిత స్థానంలో కూర్చోపెట్టాలి కాని ఇలా ఓట్లు ఎక్కువ వచ్చాయని పొమ్మనకుండా పొగపెట్టే కార్యక్రమం జనసేన అధినేత చేయడం అంటే ఇది ఒక వ్యక్తి భావోద్వేగాల మీద నడిచే పార్టీగానే ఉంది తప్ప ప్రజల మనస్సు గెలుచుకునే లక్షణాలు లేవని నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు మిగిలిన నేతలు .
జనసేన అధినేత పోకడలో రోజు రోజుకు నియంతృత్వ ధోరణి పెరిగి ప్రజలకు మరింత దూరమవుతున్నామనే భావన కూడా ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే అన్న బాటలో నడవటానికి తమ్ముడికి ఎంతో సమయం పట్టదు అని పవన్ తీరులోనే మార్పు రావాలని పవన్ ని దేవుడిగా భావించి పూజలు చేసే అభిమానులు సైతం కోరుకుంటున్నారు.