దేవరకొండ సినిమాలో రవితేజ ఫార్ములా

అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్స్ తో యూత్ హాట్ ఫేవరెట్ గా మారిన విజయ్ దేవరకొండకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకోవడంతో అభిమానులు కూడా సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళ కళ్లన్నీ పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న భారీ సినిమా మీదే ఉన్నాయి. ఇప్పటికే అరవై శాతం పైగా షూటింగ్ పూర్తి కాగా లాక్ డౌన్ వల్ల ఆగిపోయి యూనిట్ మొత్తం ముంబై నుంచి మార్చి మూడో వారంలోనే వెనక్కు వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ రీ స్టార్ట్ చేయాలని పూరి భావిస్తున్నా బయట ఉన్న పరిస్థితి దృష్ట్యా ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు.

దీనికి ఫైటర్/లైగర్ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ దీనికి పవర్ ఫుల్ పేరు పెట్టబోతున్నామని ఊరిస్తోంది కానీ అదెప్పుడు చెప్తారని అడిగితే మాత్రం మౌనమే సమాధానం అవుతోంది. ఇదిలా ఉండగా ఇందులో మదర్ సెంటిమెంట్ చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఇందుకోసమే ప్రత్యేకంగా రమ్యకృష్ణను ఒప్పించి మరీ తీసుకున్నారు. విజయ్ దేవరకొండ తల్లిగా ఇందులో ఆవిడకు చాలా భావోద్వేగాలు ఉండే సన్నివేశాలు ఉన్నాయట. ఎన్ని మాస్ సినిమాలు తీసినా తనలో ఎంత సెన్సిబుల్ ఎమోషన్ ని చూపగలడో గతంలో పూరి జగన్నాధ్ ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’లోనే రుచి చూపించాడు.

రవితేజ-జయసుధల మధ్య జరిగే ట్రాక్ అందులో చాలా హృద్యంగా ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య షూట్ చేసిన నీవే నీవే లేవంటా పాట మదర్ సెంటిమెంట్ సాంగ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది. ఇప్పుడు విజయ దేవరకొండ సినిమాలోనూ అంతకు మించిన హార్ట్ టచింగ్ ఎపిసోడ్స్ ఉంటాయట. రమ్యకృష్ణను అందుకే ప్రత్యేకంగా ఒప్పించి మరీ తీసుకొచ్చారట పూరి. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రూపొందింస్తున్నారు. హిందీ వర్షన్ కు నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల పడిన బ్రేక్ తో ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేనట్టే. ఎంత వేగంగా చేసిన 2021 సమ్మర్ కే ప్లాన్ చేశారని వినికిడి.

Show comments