Idream media
Idream media
పనులు మానుకుని రేషన్ దుకాణాల వద్దకు వెళ్లడం,. గంటల తరబడి వేచి చూడడం,.. వేలిముద్రలు పడకపోవడంతో ఖాళీ చేతులతో వెనక్కు రావడం.. మళ్లీ మరుసటి రోజు వెళ్లడం.. ఇదీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని తెల్లరేషన్‌కార్డుదారులు పడుతున్న ఇబ్బందులు. ఇకపై ఈ ఇబ్బందులు శాశ్వతంగా దూరం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా జగన్ సర్కార్ రేషన్ బియ్యం కూడా లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వనుంది. ఇప్పటికే నెలవారీ ఫించన్ సొమ్ము, ఇసుకను డోర్‌డెలివరీ చేస్తున్న ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి రేషన్ బియ్యం కూడా లబ్ధిదారులు ఇళ్ల ముంగిటకే వెళ్లి ఇవ్వనుంది.
రాష్ట్రంలో దాదాపు 1.42 కోట్ల మందికి రేషన్‌కార్డులు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ ఏర్పాటైనప్పటి నుంచీ వీరికి స్థానికంగా ఉండే రేషన్ డీలర్ ద్వారా బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనలో వినూత్న మార్పులు ప్రవేశపెట్టంది. ఈ క్రమంలోనే గ్రామ,వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ సేవలు ఏవైనా సరే ప్రజలకు వారి ఇంటి వద్దకు లేదా గ్రామ సచివాలయంలో లభించేలా వినూత్న మార్పులు చేసింది.
లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ బియ్యం ఇచ్చే విధానం ప్రవేశపెడతామని గత ఏడాదే సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుకు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అన్నిజిల్లాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించినా కరోనా కారణంగా ఆగిపోయింది. తాజాగా రేషన్ డోర్ డెలివరీకి అవసరమైన ఏర్పాట్లను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. రేషన్‌ను తరలించేందుకు వాహనాలను ప్రత్యేకంగా సిద్ధం చేయించింది. వచ్చే నెలలో మాత్రమే డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఆ మరుసటి నెల నుంచి డీలర్ల వ్యవస్థ చర్రితకానుంది. రేషన్ డోర్ డెలివరీ వల్ల పొలం పనులకు వెళ్లే గ్రామీణ ప్రజలకు సమయం ఆదాతోపాటు సౌకర్యవంతంగాను ఉంటుంది.