ప్రభుత్వం తీసుకునే మంచినిర్ణయాలకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని గతంలోనే చెప్పిన రాపాక వరప్రసాద్ నేడు అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు. దీనికి ఓ కారణం ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని రాపాక వరప్రసాద్ ను ఈరోజు ఉదయం బహిరంగ లేఖలో కోరారు. కానీ తన పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా రాపాక వరప్రసాద్ మూడు రాజధానులకు జై కొట్టారు.
అభివృద్ధి ఒక ప్రాంతంలో కేంద్రీకృతం అయివుంటే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని,అదే 13 జిల్లాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారని, దాంతో హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. రాష్ట్రం మొత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు వచ్చి పని చేస్తారని జీతం కోసం కాకుండా కేవలం తిండి కోసమే వలసలు వెళ్లి కూలిపనులు చేస్తున్నారని తెలిపారు.
రాయలసీమ ప్రాంతం నుండి బెంగుళూరుకు వలసలు పోతున్నారని అదే అనంతపురం ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. “అమ్మ ఒడి” పథకం కోసం 6500 కోట్లు ముఖ్యమంత్రి ఎలా తెస్తారని అనుకున్నారని కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న సమయానికే 6500 కోట్ల నిధులు ముఖ్యమంత్రి విడుదల చేసారని జగన్ ను కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాలను సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు భూములను నాలుగు కోట్లకు ఇచ్చి ప్రైవేట్ సంస్థలకు మాత్రం 50 లక్షలకే భూములు కట్టబెట్టారన్న సంగతి ప్రజలకు తెలియదన్నారు.
ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారని, మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారని రాపాక వరప్రసాద్ తెలిపారు. ఒకవేళ మూడు రాజధానుల కోసం ఓటింగ్ పెడితే ప్రజలు మూడు రాజధానులు కావాలనే ప్రజలు అంటారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందునే చంద్రబాబు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని, జనసేన పార్టీ తరపున ప్రభుత్వ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని రాపాక వరప్రసాద్ తన మద్దతును ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా
తన మద్దతు తెలిపారు.
కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని మొదటినుండి వ్యతిరేకిస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు బహిరంగ లేఖద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేయమని రాపాకను ఆదేశించారు. కానీ తన పార్టీ అధ్యక్షుని ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ బిల్లుకు అనుకూలంగా రాపాక వరప్రసాద్ ఓటు వేయడంతో పవన్ కళ్యాణ్ రాపాకపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.