iDreamPost
iDreamPost
దేశంలోనే పేరొందిన ప్రొడక్షన్ హౌస్ తన వెనకాల ఉన్నా దగ్గుబాటి రానాకు సక్సెస్ ఏమీ ఇన్‌స్టెంట్‌గా రాలేదు. ‘లీడర్’గా మొదటి ప్రయత్నంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించి సక్సెస్ అందుకున్న ఈ ఆరడుగుల అందగాడికి ఆ తరువాత విజయాలు అందీ అందకుండా దోబూచులాడాయి. ఇక్కడినుంచే రానా మిగిలిన నటుల్లా కాకుండా తనదైన పంథా ఎంచుకున్నాడు. కమర్షియల్ సినిమాలకో మూసపాత్రల్లో హీరోగా నటించడానికో పరిమితమై పోకుండా.. దర్శకధీరుడు రాజమౌళి మలిచిన దృశ్యకావ్యం బాహుబలి చిత్రంలో ప్రతినాయకుడు భళ్లాలదేవుడు పాత్రలో నటించి హీరోతో సమానంగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’ భిన్నమైన చిత్రాలలో నటించి వరుస సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇకపైనా విభిన్నమైన చిత్రాల్లో నటించేందుకే తన ప్రాధాన్యమంటున్న రానా… అలాంటి చిత్రాల మూడు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వాటిలో ఒకచిత్రం ‘హాథీ మేరే సాథీ’. అంటే తెలుగులో ఏనుగు నాతోడుగా ఉంది అని అర్థం. ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం వచ్చిన బాలీవుడ్ సినిమాకు ఇది రీమేక్ కావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి… బాందేవ్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కొత్త ఏడాది కానుకగా సోమవారం ‘హాథీ మేరే సాథీ’లో రానా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. ఏనుగుతోపాటు దాని దంతాల మధ్య రానా నిలుచుని ఉన్న ఈ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉండగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘1947’, మలయాళంలో రూపొందుతోన్న ‘రాజా మార్తాండ వర్మ’ చిత్రాల్లో సైతం ప్రస్తుతం రానా నటిస్తుండటం విశేషం.