iDreamPost
iDreamPost
ఇలాంటి సందేహమే కలుగుతుంది. మాజీ ఎన్నికల అధికారి అనుకోని వ్యవహారంలో తలదూర్చారు. ఆలశ్యంగా అయినా దానిని వైఎస్సార్సీపీ తెరమీదకు తీసుకురావడంతో ఇది పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు తమకు సంబంధం లేదని తేల్చేశారు. దాంతో చివరకు అనివార్యంగా మాజీ ఎస్ ఈ సీ మళ్ళీ సీన్ లోకి వచ్చారు. సుమారుగా 20 రోజుల తర్వాత తన లేఖపై స్పష్టత ఇచ్చారు. దాంతో ఇన్నాళ్లుగా ఎందుకు దాచిపెట్టారనే సందేహాలు మొదలయ్యాయి.
ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో ప్రభుత్వంతో సంప్రదించాల్సి ఉండాల్సిందని ఇప్పటికే సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. అది ఎన్నికల సంఘం అధికారిగా బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి చెంపపెట్టుగా అంతా భావించారు. అయినా ఆయన తీరు మార్చుకోలేదని దానికి కొనసాగింపుగా కేంద్రానికి రాసిన లేఖ స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో రాజకీయ నేత తరహాలో ఆయన రాతలతో లేఖ తీవ్ర కలకలం రేపింది. తొలుత లేఖ ను లీక్ చేసి, ఆ తర్వాత కొద్దిసేపటికే అది ఎస్ఈసీ రాసిన లేఖ కాదంటూ మరో లీకు విడుదల అయిన నేపథ్యంలో అనుమానాలు మొదలయ్యాయి. చివరకు కేంద్ర హోం శాఖ తరుపున సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇది నిమ్మగడ్డ రాసిన లేఖేనని స్పష్టం చేశారు.
అయినప్పటికీ నిమ్మగడ్డ మాత్రం ఇన్నాళ్లుగా నోరు మెదపలేదు. చివరకు తాజాగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఈవిషయాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. నేరుగా ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తొలుత ఎన్నికల వాయిదా సమయంలో చేసిన సంతకం, కేంద్రానికి రాసిన లేఖలో ఉన్న సంతకం భిన్నంగా ఉండడంతో అనుమానాలు వస్తున్నాయని విజయసాయిరెడ్డి ప్రస్తావించడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా తయారయ్యింది. తన వాదనకు అనుగుణంగా రెండు సంతకాల ఉత్తర్వులను డీజీపీకి విజయసాయిరెడ్డి అందించారు.
ఈ సంతకాల భాగోతం, కేంద్రానికి రాసిన లేఖ వ్యవహారంలో ఏపీ పోలీసులు విచారణకు సిద్ధపడితే సీన్ మారిపోయే ప్రమాదం ఉందని టీడీపీ భావించినట్టు కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయగానే వెంటనే టీడీపీ ఎంపీ కనకమేడల, ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ స్పందించారు. తమకు సంబంధం లేదని, తమ మీద ఆరోపణలు తగవని చెబుతున్నారు. వారికి తోడుగా నిమ్మగడ్డ కూడా ముందుకొచ్చారు. ఇన్నాళ్లుగా తన లేఖ విషయంలో అవునని గానీ, కాదని గానీ చెప్పకుండా తాత్సార్యం చేసిన మాజీ ఎస్ఈసీ ఇప్పుడు హఠాత్తుగా ప్రకటన చేయడం గమనిస్తుంటే ఎరక్కపోయి ఇరుక్కున్నాననే అభిప్రాయం ఆయనలో మొదలయినట్టు కనిపిస్తోంది. ఆ లేఖ తానే రాశానని అంగీకరించంతో లేఖలోని అంశాలు ఇప్పుడు ప్రస్తావనకు వచ్చేలా కనిపిస్తున్నాయి. పూర్తిగా టీడీపీ వాదనను వినిపించిన ఎన్నికల అధికారి వ్యవహారం మరో దుమారానికి దారితీస్తుందా లేక ఆయన ఒప్పుకున్న తరుణంలో సమసిపోతుందా అన్నది చూడాల్సి ఉంది.
మొత్తంగా టీడీపీ చేతిలో పావులా వ్యవహరించారని ఆయన పై ఉన్న ఆరోపణలకు తగ్గట్టుగా ఆయన తీరు ఉందని తేటతెల్లం అయ్యింది. నైతికంగా నిమ్మగడ్డకి ఈ పరిణామం పెద్ద అశనిపాతంగా భావింవచ్చు. టీడీపీకి కొత్త తలనొప్పిగా భావించవచ్చు. వ్యూహాత్మంగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ నేతలు వాస్తవాన్ని నిమ్మగడ్డ, టీడీపీ నేతల నోటి వెంట చెప్పించేందుకు చేసిన యత్నం కొంతమేరకు ఫలించినట్టుగానే కనిపిస్తోంది.