Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో కమలం బలపడాలనే ఆలోచనలు చేస్తోంది. కుదిరితే 2024లో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అది అంత సులువు కాదని ఆ పార్టీ నేతలకు తెలుసు. పరుగుపందెంలో గెలిచేది ఒక్కడైనా పోటీలో ఉండే ప్రతి ఒక్కరూ తాము గెలుస్తామనే నమ్మకంతోనే పరిగెడతారు. తమ శక్తి, సామర్థ్యాలు ఎంత..? అని తెలిసి కూడా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తారు.
అదే తీరున రాష్ట్రంలో కమలం నేతలు కూడా తాము అధికారంలోకి వస్తామనే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా, ప్రతిపక్ష పార్టీ స్థానాన్ని భర్తీ చేస్తామని బలంగా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించడంతో ఏదో జరిగిపోతుందన్న భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇప్పటి వరకూ బీజేపీ పగ్గాలు చేపట్టిన వారికి కన్నా.. సోము వీర్రాజు భిన్నం అని భావిస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు, బీజేపీ సానుభూతిపరులు కూడా కమల వికాశం సోము వీర్రాజు ద్వారా సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. బహుశా ఇందుకు సోము వీర్రాజు రాజకీయ పయనం, చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఆయన వ్యవహరించిన తీరు కారణం కావచ్చు.
నిన్న మంగళవారం సోము వీర్రాజు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి బండిని ఏ దిశగా నడుపుతూ లక్ష్యం చేరుకోవాలో ముందుగా ప్రణాళిక రచించుకున్నట్లుగానే.. సోము వీర్రాజు కూడా రాబోయే 4 ఏళ్లలో ఎలా పని చేయాలి..? 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఏమి చేయాలో చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జనసేన కూటమి తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసంతో సోము వీర్రాజు చెప్పిన మాటలు విన్న కమలదళంలో కొత్త ఆశలు కలిగాయి.
సోము వీర్రాజు మాట్లాడిన తర్వాత మైక్ అందుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్.. వాస్తవానికి దగ్గరగా మాట్లాడారు. ఏపీలో అధికారంలోకి రావడం అంత సులవుకాదంటూనే.. ఆ దిశగా ప్రయత్నం చేస్తామన్న సోము వీర్రాజు పయనంలో లోపాలను ఎత్తిచూపుతూ సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేశారు. పూర్వ అధ్యక్షుల మాదిరిగానే సోము వీర్రాజు మారకుండా.. తాము అనకున్న విధంగా పని చేసేలా ఆదిలోనే గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేశారు రాం మాధవ్. రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాలని స్పష్టం చేశారు. ఇతర పార్టీల భుజాలపై చేతులు వేసి వెళదామనే ఆలోచన నుంచి బటయకు వస్తేనే అనుకున్న లక్ష్యం సాధించగలమని సోముకు తన ఉద్దేశం పరోక్షంగా చెప్పారు.
జనసేనతో వెళ్లి 2024లో అధికారంలోకి వస్తామన్న సోము వీర్రాజుకు.. రాం మాధవ్ ఉద్దేశం అర్థం అయ్యే ఉంటుంది. మరి బీజేపీ అధిష్టానం ఆశించినట్లుగా సొంతగా బలపడేందుకు, 2024లో ఎవరి మద్ధతు లేకపోయినా.. ఉనికి ని బలంగా చాటుకునేలా బీజేపీని సోము వీర్రాజు తయారు చేయగలరా..? అంటే ఇప్పట్లో ఈ ప్రశ్నకు జవాబు దొరకదు. కానీ 2024 ఎన్నికల తర్వాత మాత్రం తప్పక లభిస్తుంది.