iDreamPost
iDreamPost
తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ-జనసేన కూటమి భవితవ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తానే ప్రత్యామ్నాయమని చాటుకోవాలని తపించిన బీజేపీ అందుకు జనసేనపైనే పూర్తిగా ఆధారపడింది. అయితే ఆశించినంత సహకారం అటువైపు నుంచి లభించలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తీరుతో మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ నుంచి కూడా ప్రేమ సందేశాలు వస్తున్న పరిస్థితుల్లో తిరుపతి ఫలితాన్ని సాకుగా చూపి బీజేపీతో మైత్రి బంధాన్ని తెంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
లోపించిన పరస్పర సహకారం..
రెండు పార్టీల మధ్య పొత్తు అంటే.. ఇరుపక్షాలు పట్టువిడుపులు ప్రదర్శిస్తూ.. పరస్పరం సహకరించుకోవాలి. ఇద్దరి ప్రయోజనాలను పరిరక్షించుకునేలా మసలుకోవాలి. కానీ బీజేపీ, జనసేన మైత్రి బంధం ఒకరి ప్రయోజనాల కోసమే అన్నట్లుగా సాగుతోందన్న అసంతృప్తి జనసేన కార్యకర్తల్లో బలంగా ఉంది. హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల నుంచి తిరుపతి ఉప ఎన్నిక వరకు జరిగిన పరిణామాలు.. ఈ రెండు ఎన్నికల నుంచి జనసేనను బీజేపీ బలవంతంగా తప్పించడం అంతర్గతంగా జనసేనను బాధిస్తోంది. హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఒత్తిడికి లొంగి పోటీ నుంచి తప్పుకున్న ఫలితం ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేయనందుకే తెలంగాణలో తన గ్లాసు గుర్తును 2025 వరకు జనసేన కోల్పోయింది. ఆంధ్రలోనూ ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన అగత్యం ఏర్పడింది. కానీ బీజేపీతో పొత్తు పేరుతో తిరుపతి బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పొత్తు పేరుతో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ ఒత్తిడి భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం జనసైనికుల్లో ఉంది. ఇంకా ఆ పార్టీతోనే ప్రయాణిస్తే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
ప్రచారంలో అంటీముట్టనట్లు..
తిరుపతి నుంచి తనే పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్న జనసేన మెడలు వంచి బీజేపీ తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. కానీ అక్కడ బలం, బలగం లేని పరిస్థితుల్లో పూర్తిగా జనసేనపైనే ఆధారపడాల్సి వచ్చింది. అందుకోసం జనసేనానిని ఆకాశానికెత్తేసింది. రాష్ట్రానికి అధినేతగా పవన్ ను చూడాలనుకుంటున్నామని సోము వీర్రాజు తదితర బీజేపీ నేతలు ప్రసంగాల్లో ఊదరగొట్టినా జనసైనికుల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. పవన్ కల్యాణ్ సైతం మొక్కుబడిగా ఒక్కపూట తిరుపతిలో ప్రచారం చేసి వెళ్లిపోయారు. ప్రచారం ముగింపునకు మూడు రోజుల ముందు నాయుడుపేటలో రెండు పార్టీల అధ్యక్షుల నేతృత్వంలో విజయయాత్ర పేరుతో భారీ బహిరంగ సభకు కమలదళపతులు ప్లాన్ చేశారు. అయితే కరోనా క్వారెంటైన్ పేరుతో పవన్ హాజరుకాకపోవడంతో ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. క్షేత్రస్థాయి ప్రచారంలోనూ బీజేపీకి జనసైనికుల నుంచి ఏమాత్రం సహకారం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఫలితాల్లో బీజేపీకి లభించే ఓట్లు ఆ రెండు పార్టీల పొత్తుపై ప్రభావం చూపనున్నాయి.
మరోవైపు వకీలసాబ్ సినిమా టికెట్ల ధరల అంశాన్ని ఆధారం చేసుకుని టీడీపీ అధినేత పవన్ పై బోల్డంత సానుభూతి కురిపించారు. తద్వారా తన భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటినుంచే తన అంతరంగ స్నేహితుడికి ద్వారాలు తెరిచి ఉంచారు. తిరుపతి ఫలితాలను బట్టి వీటిలో ఏదో ఒక కొత్త సమీకరణ తెరపైకి రావచ్చన్న చర్చ జరుగుతోంది.
Also Read : ఉప ఎన్నిక తర్వాత టీడీపీలో ఏం జరగబోతోంది..?