iDreamPost
android-app
ios-app

అది కూడా బీజేపీతోనే సాధ్యమని చెప్పండి సోము..!

అది కూడా బీజేపీతోనే సాధ్యమని చెప్పండి సోము..!

రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేసింది చెప్పుకోవాలి. అప్పుడే ఓట్లు పడతాయ్‌. ఏపీలో అధికారంలోకి వస్తామనే ఆశతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆ పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేసిందనే విషయాలను తరచూ మీడియా ముందు చెబుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇచ్చిందని జీవీఎల్‌ చెబుతున్నారు. ఇక సోము వీర్రాజు బీజేపీ వల్లనే.. ఏపీ చిరకాల కోరిక అయిన విశాఖ రైల్వే జోన్‌ సాధ్యమైందని చెబుతున్నారు.

విశాఖ రైల్వే జోన్‌ బీజేపీ వల్లనే సాధ్యమైందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలు విన్నవారికి.. విశాఖ జోన్‌ ఏర్పాటు అయిందా..? అనే సందేహం రాక మానదు. చెక్‌ చేసి చూస్తే గానీ అసలు విషయం బోధపడదు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయిందని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో చెప్పారట.. ఆ మాటను ఉదహరిస్తూ సోము వీర్రాజు విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు అయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియపై ఇలాంటి ప్రకటనలు కేంద్రం అనేకసార్లు పార్లమెంట్‌లో చేసింది. కానీ కార్యాచరణ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

రాష్ట్ర విభజన చట్టం 2014లో విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని పొందుపరిచారు. రాష్ట్ర విభజన చట్టం అమలులోకి వచ్చి 8 ఏళ్లు అవుతోంది. ఈ కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. 8 ఏళ్లుగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేసే పనిలోనే కేంద్ర ప్రభుత్వం ఉండడం బహుశా సోము వీర్రాజుకు తెలియదేమో..! ప్రకటనలు, మాటలు కాకుండా.. చేతల్లో పని చేసి రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తే.. సోము వీర్రాజు ఆశిస్తున్నట్లుగా ఆ క్రెడిట్‌ బీజేపీకే దక్కుతుంది.

రైల్వే జోన్‌ ఏర్పాటు బీజేపీతోనే సాధ్యమైందని చెప్పుకుంటున్న సోము వీర్రాజు.. ప్రత్యేకహోదాపై కూడా ఇదే విధంగా మాట్లాడితే.. కమలం పార్టీకి మంచి మైలేజీ వస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హమీ చెప్పారు. ఈ హామీని అమలు చేసి.. ఏపీకి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తే.. బీజేపీ న్యాయం చేసిందని వీర్రాజు ఘనంగా చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా బీజేపీని విశ్వసిస్తారు. ఆ పార్టీకి ఓట్లు కూడా వేస్తారు.