iDreamPost
android-app
ios-app

పవన్‌పై వారు ఇంకా కోపంగా ఉన్నారా..?

పవన్‌పై వారు ఇంకా కోపంగా ఉన్నారా..?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది నిజమేనని అనేకసార్లు రుజువైంది. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల మాదిరిగా.. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కూడా మారిపోతుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తు పెట్టుకుని,ఆ తంతు కాస్త అయిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటుంటారు. మరికొన్ని పార్టీలు పాత మిత్రులను వదిలేసి.. కొత్త మిత్రులతో స్నేహం చేస్తుంటాయి. అలాంటి పార్టీల అధినేతలపై పాత మిత్రులు గుర్రుగా ఉంటుంటారు. ఈ తరహాకు చెందిన పార్టీలే జనసేన, కమ్యూనిస్టులు.

గత ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టులతో కలసి జనసేన పోటీ చేసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన వీరిని వదిలేసి.. బీజేపీతో స్నేహం చేస్తోంది. దీంతో సందర్భం వచ్చిన ప్రతిసారి కమ్యూనిస్టులు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికితే విమర్శలు చేస్తున్నారు. బీజేపీపై గతంలో జనసేనాని చేసిన విమర్శలను గుర్తుచేస్తూ గిల్లుతున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. జనసేన ఆవిర్భావసభలో బీజేపీ ఇచ్చే రూట్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నామంటూ పవన్‌ మాట్లాడడంతో.. ఆ పార్టీకి పవన్‌ ఇస్తున్న ప్రాధాన్యత అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలో సీపీఐ రామకృష్ణ.. ఏపీకి బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌కు ఇప్పుడు ఆ లడ్డూల టేస్ట్‌ మారిందా..? అంటూ సూటిగా ప్రశ్నించి ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. తమను పవన్‌ మోసం చేశాడనే భావనలో ఉన్న కామ్రేడ్‌ రామకృష్ణ తన కోపాన్ని ఇలా తీర్చుకుంటున్నారు.

2014 ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతు ఇచ్చారు. ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ఆ రెండు పార్టీలకు మిత్రుడుగా ఉన్న పవన్‌.. ఆ తర్వాత బీజేపీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని, పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు చేశారు. సీపీఎం, సీపీఐలతో కలసి పలు కార్యక్రమాలు నిర్వహించారు.

2019 ఎన్నికల్లో బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ), సీపీఐ, సీపీఎంలతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలకు వెళ్లారు. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పరస్పర అంగీకారంతో పంచుకుని పోటీలోకి దిగారు. జనసేన 20 లోక్‌సభ సీట్లు, 140 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయగా.. బీఎస్పీ మూడు లోక్‌సభ, 21 అసెంబ్లీ సీట్లలోనూ, సీపీఐ, సీపీఎంలు చెరో ఒక లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. జనసేనాని పవన్‌ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. మొత్తంగా ఈ కూటమి ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ మాత్రమే గెలుపొందారు. కమ్యూనిస్టులతో లాభం లేదనుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలు ముగిసిన కొద్దిరోజులకే మళ్లీ బీజేపీతో స్నేహం చేయసాగి.. కామ్రేడ్ల కోపానికి గురవుతున్నారు.