iDreamPost
android-app
ios-app

రూట్‌ మ్యాప్‌ సోము దగ్గరే పెట్టుకున్నారా..?

రూట్‌ మ్యాప్‌ సోము దగ్గరే పెట్టుకున్నారా..?

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం అందరికీ విడ్డూరంగా అనిపించింది. కలిసి కార్యక్రమాలు చేస్తామని అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు ప్రకటించారు. అయితే పొత్తు పెట్టుకుని రెండున్నరేళ్లు అయినా.. ఆ రెండు పార్టీలు పొత్తులో ఉన్నట్లు ఎక్కడా అనిపించలేదు, కనిపించలేదు. ముఖ్యంగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో లేమన్నట్లుగానే వ్యవహరించింది. బీజేపీ మాత్రం జనసేనతో కలసి 2024లో అధికారంలోకి వస్తామని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రకటనలు చేస్తోంది. అయితే ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జనసేనలో బీజేపీ పట్ల స్పష్టమైన మార్పు వచ్చింది. తొలిసారి జనసేన అధినేత బీజేపీతో పొత్తు పట్ల ఆసక్తితో, విశ్వాసంతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన రూట్‌ మ్యాప్‌ను ఇవ్వాలని బీజేపీని పార్టీ అవిర్భావ సభలో పవన్‌ అడిగారు.

రూట్‌ మ్యాప్‌ ఇవ్వాలని బీజేపీని పవన్‌ కళ్యాణ్‌ అడుగుతుంటే.. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తమకు అమిత్‌ షా రెండు నెలల క్రితమే రూట్‌మ్యాప్‌ ఇచ్చారని చెబుతూ జనసేనకు షాక్‌ ఇచ్చారు. పైగా ఆ రూట్‌ మ్యాప్‌ ప్రకారమే తాము జనసేనతో కలిసి వైసీపీపై పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సోము ప్రకటనతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమిత్‌ షా రెండు నెలల క్రితమే రూట్‌ మ్యాప్‌ ఇస్తే.. దాని కాపీ జనసేనకు ఇవ్వలేదా..? జనసేనకు ర్యూట్‌ మ్యాప్ కాపీ ఇవ్వకుండానే ఆ పార్టీతో కలిసి పోరాటం చేయడం వెనుక కారణం ఏమిటి..? ఉందామా..? పోదామా అన్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ ఉండడంతో పార్టీ పెద్దల సూచనలతోనే ర్యూట్‌మ్యాప్‌ జనసేనకు ఇవ్వలేదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

బీజేపీకి టైం వచ్చింది..

బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నా.. అది ఇష్టంలేని సంసారం మాదిరిగానే నడిచింది. రెండు పార్టీలు కలిసి ఏనాడు కార్యక్రమాలు చేయలేదు. బద్వేలు, తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పా.. బీజేపీతో జనసేన కలవలేదు. పొత్తు ఉన్నా.. ఆ ఉప ఎన్నికల్లో మద్ధతు ఇవ్వాలని పవన్‌ను బీజేపీ నేతలు అడగాల్సి వచ్చింది. బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంటే.. జనసేన పోటీకి దూరం అంటూ పవన్‌ ప్రకటన విడుదల చేశారు. జనసేనతో కలిసి అధికారంలోకి వస్తామని సోము వీర్రాజు పదే పదే చెబుతున్నా.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కానీ, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌గానీ బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ఎన్నడూ చెప్పలేదు. పైగా పవన్‌ తీరు పొత్తు బీజేపీతో మనసు టీడీపీ వద్ద ఉన్నట్లుగా ఉంది. ఈ పరిణామాలు నిన్నమొన్నటి వరకు ఏపీ బీజేపీ నేతలకు చికాకు తెప్పించాయి. ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల తర్వాత బీజేపీ టైం మొదలైంది. అందుకే పవన్‌ ర్యూట్‌ మ్యాప్‌ అడుగుతుంటే.. అది రెండు నెలల క్రితమే అమిత్‌ షా ఇచ్చారంటూ సోము వీర్రాజు తాపీగా చెబుతున్నారు.