iDreamPost
android-app
ios-app

Raktha Sambandham : రక్త సంబంధం రిపోర్ట్

  • Published Oct 14, 2021 | 4:43 AM Updated Updated Oct 14, 2021 | 4:43 AM
Raktha Sambandham : రక్త సంబంధం రిపోర్ట్

దసరా సంబరాలు థియేటర్లలోనే కాదు ఓటిటిలోనూ మొదలయ్యాయి. జ్యోతిక 50వ సినిమాగా మంచి ప్రచారం దక్కించుకున్న రక్త సంబంధం ఓటిటి రిలీజ్ అఫీషియల్ గా ఈ రోజే అయినప్పటికీ నిన్న రాత్రి నుంచే అందుబాటులోకి వచ్చింది. దీనికి సూర్య నిర్మాత. శశికుమార్, సముతిరఖని ప్రధాన పాత్రల్లో సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలేమీ లేవు కానీ డిజిటల్ విడుదల కాబట్టి ట్రైలర్ చూశాక అంతో ఇంతో ఆసక్తి కలిగింది. అందులోనూ ఇటీవలి కాలంలో విలేజ్ డ్రామాలు పెద్దగా రాలేదు. మరి పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ అన్నాచెల్లి చిత్రం ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

భైరవ(శశికుమార్)మహా కోపిష్టి. ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోడు. అవసరమైతే కొట్టి మరీ న్యాయం చేస్తాడు. ఇతనికి చెల్లి మాతంగి(జ్యోతిక)అంటే ప్రాణం. అనాధ అయిన స్కూల్ మాస్టర్(సమితిరఖని)కి మాతంగిని ఇచ్చి పెళ్లి చేసి బావను ఇల్లరికం తెచ్చుకుంటాడు. రెండు జంటలకు పిల్లలు అయ్యాక అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మాతంగి కొడుకు చనిపోతాడు. దీనికి భైరవే కారణమని భావించిన మాస్టర్ వాళ్ళతో సంబంధం తెంచుకుంటాడు. కొన్నేళ్లు గడిచాక రెండు కుటుంబాలు ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలవుతాయి. కానీ ఊహించని పరిణామాలు జరిగి కథ మళ్ళీ మొదటికే వస్తుంది. అదంతా తెరమీదే చూడాలి

దర్శకుడు శరవణన్ తీసుకున్న కథ తాతల కాలం నాటిది. స్క్రీన్ ప్లే భారతదేశానికి స్వతంత్రం రాకముందు రాసుకున్నది. ఓవర్ సెంటిమెంట్ తో కన్నీళ్లు పెట్టించే సీన్లు పదే పదే రాసుకుంటే చాలనుకుని విపరీతమైన ల్యాగ్ తో తెరకెక్కించిన తీరు ఆ మధ్య వచ్చిన కార్తీ చినబాబుని గుర్తు చేస్తుంది. అక్కడక్కడా మంచి భావోద్వేగాలు ఉన్న సీన్లు పడినప్పటికీ అవి సరిపోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సరైన మ్యాటర్ లేక ఏవేవో మలుపులు పెట్టి నడిపించిన తీరు విసుగు తెప్పిస్తుంది. ఇమ్మాన్ సంగీతం మొదట్లో బాగుందనిపించినా పోను పోను సహనానికి పెట్టే పరీక్షలో తానూ క్వశ్చన్ పేపర్ అయ్యాడు. టన్నుల కొద్దీ ఓపిక ఉండి, అతి సెంటిమెంట్ కనెక్ట్ అవుతుందనుకుంటే ఈ రక్త సంబంధం ట్రై చేయొచ్చు. లేదా ఇదే టైటిల్ తో పాత ఎన్టీఆర్ సినిమా చూడటం బెటర్

Also Read : Samantha: గతాన్ని వదిలేసి కెరీర్ కోసం సామ్ ప్లానింగ్