iDreamPost
android-app
ios-app

రజనీకాంత్ బాషా ఒరిజినల్ కాదా? – Nostalgia

  • Published Feb 23, 2020 | 12:06 PM Updated Updated Feb 23, 2020 | 12:06 PM
రజనీకాంత్ బాషా ఒరిజినల్ కాదా?  – Nostalgia

రజనీకాంత్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ బాషా చిత్రానిది మాత్రం చాలా చాలా ప్రత్యేకమైన స్థానం. దాన్ని ఆధారంగా చేసుకుని నార్త్ నుంచి సౌత్ దాకా ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డికి స్ఫూర్తి ఇందులో నుంచి తీసుకున్నదే. వాస్తవానికి బాషా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీనికి కూడా స్ఫూర్తి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే బాషా ఇంకో లాంగ్వేజ్ లో సూపర్ హిట్ అయిన సినిమా నుంచి ఇన్స్ పిరేషన్ తీసుకున్నదే. ఆ సంగతులేంటో చూద్దాం. 

1991లో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ “హమ్” సినిమా విడుదలైంది. కథలోకి వెళ్తే టైగర్(అమితాబ్) పెద్ద షిప్ యార్డ్ లో లేబర్ గా పని చేస్తుంటాడు. అతనికి ఇద్దరు తమ్ముళ్లు. యార్డు యజమాని డాని ఆగడాలు భరించలేక తిరగబడతాడు టైగర్. ఆ తిరుగుబాటులో యార్డ్ యజమాని ఆస్తులు వదిలేసి పరిపోతాడు. ఇదే అదనుగా అతని అనుచరుడు అనుపమ్ ఖేర్ వాటిని దోచుకుంటాడు. ఇంతా జరిగాక టైగర్ ఊరు వదిలి వేరే చోటుకి వెళ్ళి అజ్ఞాతంలో జీవిస్తూ తమ్ముళ్లను పెంచి పెద్ద చేస్తాడు. వాళ్లే రజనీకాంత్, గోవిందా.

గుట్టు గా జీవితాన్ని గడుపుతున్న టైగర్ అనుకోని పరిస్థితుల వల్ల తన ఉనికిని బయట పెట్టుకునే పరిస్థితి వస్తుంది. అప్పటి దాకా శాంత మూర్తి లా కనిపించిన అమితాబ్ ఒక్క సారిగా ఉగ్ర రూపం దాల్చే సరికి తమ్ముళ్ళు విస్తు పోతారు.అప్పటికే విలన్గా మారిన అనుపమ్ ఖేర్ అజ్ఞాతం నుంచి బయటికి వచ్చిన డ్యాని ఇద్దరినీ టైగర్ ఎలా మట్టి కరిపించాడు అనేది క్లైమాక్స్. సింపుల్ గా కథ ఇది.

ఇప్పుడు బాషా తీసుకుంటే సరిగ్గా దీనికి రివర్స్ స్క్రీన్ప్లే లో వెళ్తుంది. హీరో ముందు అజ్ఞాతం లో ఉంటాడు. విలన్ రెచ్చగొట్టటంతో ఇంటర్వెల్ బ్లాక్ లో బ్లాస్ట్ అయ్యి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేసుకుంటాడు. నేరుగా క్లైమాక్స్ లో విలన్ అంతు చూడటంతో ముగుస్తుంది. ఇది హమ్ రీమేక్ అనడానికి ప్రధానమైన కారణాలు.

1. విలన్ నేపథ్యం, స్వభావం, అతను ఆస్తులు వదిలేసి పారిపోతే అతని భార్య పిల్లల్ని అనుచరుడు హత్య చేసి వాటిని ఆక్రమించుకోవడం యధాతథంగా వాడారు.

2. తన అసలు పేరును హీరో దాచి పెట్టి కొత్త పేరు మృదు స్వభావిగా జీవితాన్ని గడపటం రెండు సినిమాలోనూ కనిపిస్తుంది.

3. హమ్ లో ఇద్దరూ తమ్ముళ్లను బాషాలో ఇద్దరు చెల్లెళ్ళు గా మార్చేసారు.

4. హమ్ లో వయసురీత్యా అమితాబ్ పాత్ర కాస్త వయసు మళ్ళిన వాడిలా చూపిస్తే బాషా లో మాత్రం మరీ అంత వ్యత్యాసం లేకుండా చూసుకున్నారు. హీరోయిన్ నగ్మాతో లవ్ ట్రాక్ మరియు పాటల కోసం.

5. హమ్ లో విలన్ కూతుర్ని హీరో తమ్ముడు ప్రేమిస్తే బాషా లో మాత్రం హీరోనే ప్రేమిస్తాడు. అతని ఉనికి బయటకు రావడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది రెండు చిత్రాల్లో.

6. హమ్ లో షిప్ యార్డ్ నేపధ్యం ఆయితే బాషా లో దాన్ని ముంబై మాఫియా గ మార్చేసారు.

7. హమ్ లో రజనీకాంత్ అమితాబ్ తమ్ముడిగా ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపిస్తాడు. ఆ సినిమా స్ఫూర్తితోనే మార్పులు చేయించి దర్శకుడు సురేష్ కృష్ణ తో బాషా స్క్రిప్ట్ రాయించినట్టు స్పష్టంగా చెప్పవచ్చు.

మక్కీకి మక్కి కాకపోయినా చాల మటుకు హమ్ స్ఫూర్తితోనే బాషా తీసారనేది ముమ్మాటికి నిజం. హమ్ హిట్ అయినప్పటికీ బాషా మాత్రం రజని చిత్రాల్లోనే పెద్ద హిట్ గా, ఇలాంటి చిత్రాలకు రిఫరెన్స్ గ మారింది.