Idream media
Idream media
భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో జూన్ 16న సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది సైనికులు వీర మరణం పొందారు. నాటి నుంచి చైనాపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం హోరెత్తుతోంది. మరోవైపు.. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ సమాయత్తమవుతోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చర్చలు జరుపుతూనే.. అవసరమైతే డ్రాగన్ ను ఎదిరించేందుకు సిద్ధమవుతోంది. సైనికులను సమాయత్తం చేస్తోంది. కావాల్సి వస్తే.. మరింత ఆయుధ బాంఢాగారాన్ని సమకూర్చుకునేందుకు ఆర్థిక బలాన్ని అందిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులపై ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భారత త్రిదళాధిపతి(సీడీఎస్) బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఊరుకోవద్దని, ఎదురు తిరగండి.. అని ఆదేశించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చైనా దాడులను తిప్పికొట్టాలని, వారి ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.
త్రివిధ దళాలూ చైనా విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలని, జల, వాయు మార్గాల ద్వారా చైనా ప్రవేశించే అవకాశం ఉన్నందున గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. మీకు మీరుగా ఘర్షణ వాతావరణం సృష్టించవద్దని.. చైనా తద్విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ధీటుగా బదులివ్వండి అని.. సైనికాధికారులకు స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు… గాల్వన్ లోయలో పరిస్థితిని ప్రభుత్వానికి భద్రతా దళాలు చేరవేస్తున్నాయి. ఇప్పటికే లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 ప్రాంతంలో భారత సైన్యం పట్టు సాధించింది. పరిస్థితులకు అనుగుణంగా అవసరమైతే సైన్యం తగిన నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొద్ది రోజుల క్రితమే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
నేడు కల్నల్ ఇంటికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సోమవారం పరామర్శించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతోపాటు నివాస స్థలం, సంతోష్‌బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని రెండు రోజుల క్రితం తెలిపారు. తానే స్వయంగా వారి ఇంటికి వెళ్లి సాయం అందజేస్తానన్నారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ కేసీఆర్ రాకను పురస్కరించుకుని స్థానికంగా ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు తదితరులు ఆదివారమే ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో సంతోష్‌బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.