iDreamPost
iDreamPost
ఇప్పుడు పరిస్థితి మరీ సున్నితమైపోతుంది.ఒక నీటి ప్రాజెక్ట్ ప్రకటించగానే విమర్శల జడివాన కురుస్తుంది…దిగువ రాష్ట్రం ఏ ప్రాజెక్ట్ చేపట్టిన ఎగువ రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పటం సహజమైపోయింది…రాజకీయ పక్షాలు – ఏ సమస్య అయినా రాజకీయ కోణంలోనే ఆరోపణలుచేస్తున్నాయి. విషయంలోకి వెళ్లి పరిశీలించి, సాంకేతిక అంశాలు తరచి చూసి,గత అనుభవాలు,వాదనలను తెలుసుకొని మాట్లాడే పద్దతి ఇప్పుడు లేదు.
పోతిరెడ్డిపాడుతో వివాదం ఏంటి?
పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విడుదలైన జీవో 203 మీద తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ,విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
పోతిరెడ్డి పాడు సామర్ధ్యం ఎందుకు పెంచుతున్నారు?
రాయలసీమకు ఉన్న ఏకైక అవకాశం వరద వచ్చినప్పుడే తోడిపోసుకోవాలి… తక్కువ సమయంలో బిందె నిండాలంటే చెంబు పెద్దది కావాలి..సీమకు ఉన్నది రెండే మార్గాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువ ద్వారా నీటిని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు అక్కడ నుంచి తెలుగు గంగ ,శ్రీశైలం కుడి కాలువ,గాలేరు-నగరి,నిప్పుల వాగు ఎస్కేప్ ఛానెల్ ద్వారా కేసి కెనాల్ లకు నీటిని అందించాలి…
మాల్యాల వద్ద ఉన్న ఎత్తిపోతలతో హంద్రీ-నీవా కాలువలోకి నీరు తోడాలి. దీని ప్రస్తుత సామర్ధ్యం 2000 క్యూసెక్కులు కూడా లేదు అంటే ఒక టీఎంసీ నీటిని తోడాలంటే సుమారు 6 రోజుల పడుతుంది. సుంకేసుల వద్ద మొదలయ్యే కేసి కెనాల్ పరిస్థితి కూడా అంతే.
శ్రీశైలంలో 858 అడుగులలో నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ కాలువలో పూర్తి సామర్థ్యంతో నీళ్లు పారేది. శ్రీశైలంలో 840 అడుగుల కన్నా తక్కువ నీరు ఉంటే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు పారవు. 780-800 అడుగులు ఉన్న హంద్రీ-నీవా నుంచి నీటిని తోడ వచ్చు కానీ అది రోజుకు ఎత్తిపోసేది 2000 క్యూసెక్కులు మాత్రమే…
మరోవైపు సంవత్సరం సంవత్సరానికి వరద రోజులు తగ్గిపోతున్నాయి. బాగా వర్షాలు కురిసాయి అనుకున్న నిరుడు కూడా మంచి వరద వచ్చింది 70 రోజులే. ఐదు సంవత్సరాలను ఒక సైకిల్ గా చూస్తే సగటు వరద రోజులు 45-50 కూడా లేవు..
ఈ పరిస్థితులు గమనించే ముఖ్యమంత్రి జగన్ వరద ఉన్న 30 రోజులలోనే గరిష్టంగా నీటిని తీసుకోవాలన్న లక్ష్యంతో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 పెంచుతూ జీవో ఇచ్చింది. పోతిరెడ్డిపాడుతో పాటు నీరు పారవలసిన కాలువల సామర్ధ్యం కూడా పెంచటానికి జీవో ఇచ్చారు…
హరీష్ రావు “మా వాటా మేము వాడుకున్న తరువాత సముద్రంలోకి వెళ్లే నీటిని మీరు వాడుకోండి” అని చెప్తున్నారు. మరి సముద్రంపాలవుతున్న ఆ నీటిని వాడుకోవటానికే కదా పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచుతుంది? దీంట్లో వారికి అభ్యంతరం ఉండవలసిన అవసరం ఏముంది?
దీని వలన ఎవరికైనా నష్టం ఉంటుందా?
మనం మాట్లాడుతుంది మంచి వరద రోజులలో నీటిని తీసుకోవటం గురించే.మాములు రోజులలో నీటి వాడకం గురించి శ్రీశైలం ప్రాజెక్ట్ కు గట్టి ఆపరేషన్ రూల్స్ ఉన్నాయి.
నీళ్లు ఉన్నప్పుడు తెలంగాణా పరిధిలోని అది కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువన ఉన్న భీమా ఎత్తిపోతల,నెట్టెంపాడు ఎత్తిపోతల నుంచి పూర్తిస్థాయిలో నీరు తీసుకోవచ్చు. జూరాల నుంచి కుడి కాలువ కింద కావలసినన్ని నీళ్లు తీసుకోవచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత జూరాల కుడి కాలువ కింద పెరిగిన దిగుబడే చెప్తుంది నీటి వసతి కల్పించే కాలువల వ్యవస్థ ఎంతగా మెరుగుపడిందో… ఇవన్నీ దాటుకొని దిగువకోస్తే ఎడమ గట్టు మీద పాలమూరు-రంగారెడ్డి మరియు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు సులభంగా రెండున్నర టీఎంసీల నీటి ని తెలంగాణ తోడు కోవచ్చు.వీటిలో ఒక్క కల్వకుర్తి మాత్రమే పోతిరెడ్డిపాడు దిగువున ఉన్నది ..మిగిలినవన్నీ ఎగువన ఉన్న ప్రాజెక్టులే.. ఇన్ని ప్రాజెక్టులు దాటుకొని వచ్చిన నీటిని తీసుకోవటానికి పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచటం వలన తెలంగాణాకు నిజంగా నష్టం జరుగుతుందా? ఏమాత్రం నష్టం లేదు.
వరద నీటి వాడకం మీద ట్రిబ్యునల్స్ ఏమి చెప్పాయి?
బచావత్ కేవలం నికరజలాలనే మూడు రాష్ట్రాలకు పంచాడు. బచావత్ అవార్డు ప్రకారం మహారాష్ట్రకు 585 టీఎంసీ,కర్ణాటకకు 734 టీఎంసీ,ఆంధ్రాకు 811 టీఎంసీల నీరు కేటాయించబడింది. వీటికన్నా అధికంగా వచ్చే నీరు అంటే వరద నీటి మీద హక్కు దిగువున ఉన్న ఆంధ్రాకే ఇచ్చాడు. ఆ నీటిని ఆంధ్రా వాడుకోవటం మీద ఎగువ రాష్ట్రాలకు అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదని చెప్పాడు.
బచావత్ ట్రిబ్యునల్ కాలపరిమితి ముగిసిన తరువాత ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ రిపోర్ట్ మీద సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మాత్రం వరద జలాలను కూడా మూడు రాష్ట్రాలకు(తెలంగాణను కలుపుకొని టెక్నికల్ గా నాలుగు రాష్ట్రాలకు) ప్రాజెక్టుల వారీగా కేటాయించాడు. ఆ కేటాయింపుల ప్రకారం తెలంగాణాకు చెందిన నెట్టెంపాడు ఎత్తిపోతలకు 22 టీఎంసీలు, SLBC (శ్రీశైలం ఎడమ కాలువ) 30 టీఎంసీ, కల్వకుర్తి ఎత్తిపోతల 25 టీఎంసీలు కేటాయించాడు. ఆంధ్రా/రాయలసీమ పరిధిలోని తెలుగు గంగ 29 టీఎంసీలు, హంద్రీ-నీవా 40 టీఎంసీ,గాలేరు-నగరి- 38 టీఎంసీ మరియు వెలిగొండ 43. టీఎంసీలు కేటాయించాడు.
వైయస్ఆర్ మొదలు పెట్టి పూర్తి చేసిన నెట్టంపాడు పూర్తి సామర్ధ్యంతో అంటే 22 టీఎంసీలు పనిచేస్తుంది. వైయస్ఆర్ మొదలు పెట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల కూడా ఇప్పుడు దాదాపు 30 టీఎంసీలు లిఫ్ట్ చేయగలుగుతుంది. వీటి కాలువల పొడవు రాయలసీమ ప్రాజెక్టుల కాలువల పొడవుతో పోలిస్తే చాలా తక్కువ.అందుకే చివరి ఆయకట్టువరకు నీళ్లు ఇవ్వగలుగుతున్నారు. ఆప్రాంతాలకు ఈ ప్రాజెక్టుల ఫలాలు పూర్తిగా అందుతున్నాయి.
ఆంధ్రా వైపు ,వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పటికి ఒక్క టన్నెల్ కూడా పూర్తి కాలేదు.హంద్రీ-నీవా,గాలేరు-నగరి సుమారు 80% పూర్తి అయినా తక్కువ లిఫ్ట్ సామర్ధ్యం, కాలువల సామర్ధ్యం తక్కువగా ఉండటం వలన 50% నీళ్లు కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. నిర్ధేశిత ఆయకట్టులో 50% పొలాలకు కూడా నీరు ఇప్పటికి దక్కని పరిస్థితి.
2019 సంవత్సరాన్నే తీసుకుంటే సుమారు 1100 టీఎంసీలు సముద్రంలో కలిసినా, తెలుగు గంగ ప్రాజెక్ట్ లో భాగమైన బ్రహ్మం సాగర్ ప్రాజెక్టులో 3 టీఎంసీ లు కూడా చేరలేదు. నీరు ఉన్నా వాడుకోలేని దుస్థితి దీన్ని చూస్తే అర్ధమవుతుంది.నవంబర్ రెండవ వారంలో శ్రీశైలం ప్రాజెక్ట్ పై నుంచి నీళ్లు పొంగిపొర్లాయి కానీ సీమ ప్రాజెక్టులు నిండలేదు. ఈ రోజుకి ఏ ప్రాజెక్టులో కూడా కనీసం 25% నీళ్లు కూడా లేవు,అందుకే ఇప్పుడు పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచుతుంది.
సరే,ఆంధ్రా ఎక్కువ నీళ్లు వాడుకుంటే?అన్న అనుమానం ఉందనుకుందాం…
గత ఆరు సంవత్సరాల నుంచి తెలంగాణ,ఆంధ్రా స్వేచ్ఛగా నీటిని వాడుకుంటున్నాయా? ఎందుకు ప్రతిసారి కృష్ణా బోర్డు కు ఎన్ని నీళ్లు కావాలో ఇండెంట్ పెట్టి వాళ్ళు అనుమతి ఇచ్చిన మేర నీటిని వాడుకుంటున్నాయి?ఏ కాలువ కింద ఎన్ని నీళ్లు వాడుకుంటున్నారో కచ్చితంగా ఎలా లెక్క చెప్పగలుగుతున్నారు? అంటే నీళ్లు విడుదల చేసే “కీ” ఎవరి దగ్గర ఉంది?పారిన నీళ్లును కొలిచే టెలిమెట్రీ లు పెట్టింది ఎవరు?
నీటివాడుకం మీద గతంలో లాగ అనుమానించే అవసరం ఇప్పుడు ఉందా? కృష్ణ బోర్డు పర్యవేక్షణలో పారదర్శకంగా నీటి వాడకం జరగటం లేదా? కృష్ణా బోర్డు,కేంద్ర జలసంఘం పర్యవేక్షుణలోనే నీటి వాడకం జరుగుతుందన్న వాస్తవం గుర్తించాలి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ,డిండి ఎత్తిపోతల పథకాలకు అనుమతులు ఉన్నాయా?
కొత్త ప్రాజెక్టుల మీద విభజన చట్టం ఏం చెబుతోంది?
20-Sep-2016 న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి,డిండి ప్రాజెక్ట్ నిర్మాణం మీద వీటికి అనుమతులు లేవని ఆంధ్రా ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.విభజన చట్టం సెక్షన్ 11 ప్రకారం నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ,హంద్రీ-నీవా,గాలేరు-నగరి, వెలుగొండ,కల్వకుర్తి,నెట్టెంపాడు ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఉన్నందున,ఈ జాబితాలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు లేనందున వాటిని విభజన చట్టాన్ని అతిక్రమించి కడుతున్నట్లు ఆంధ్ర ప్రభుత్వం వాదించింది.
దాని మీద కేసీఆర్ స్పందిస్తూ వైయస్ఆర్ హయాంలోనే వాటికి పాలనా పరమైన అనుమతులు ఇచ్చారని చెప్తూ, “బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎంతమేర జలాలు మాకు కేటాయిస్తే ఆ నీటిలో నుంచే తీసుకుంటామని ” కేంద్రానికి,ఆంధ్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.
పాలమూరు -రంగారెడ్డి,డిండి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర రైతులు సుప్రీంకోర్టులో వేసిన కేసులో కేంద్ర ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని తెలియచేస్తూ.. సాంకేతిక ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల DPR(Detailed Project Report) KRMB(Krishna River Management Board)కి సమర్పించలేదని కోర్టుకు తెలిపింది.
2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జూరాల బ్యాక్ వాటర్స్ నుంచి 70 టీఎంసీ లు ఎత్తిపోయటానికి డీపీఆర్ తయారుచేయటానికి సర్వే నిర్వహించాలని మాత్రమే జీవో ఇచ్చారని, ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కాదని కూడా కోర్టుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపాడు.
వాస్తవంగా పైన చెప్పిన సర్వే ప్రకారం 2014లో తొలుత జూరాల-పాకాల పేరుతోనే కేసీఆర్ ప్రాజెక్టును ప్రకటించింది. కానీ తరువాత మనసు మార్చుకొని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పాలమూరు-రంగా రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేసాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే వాదిస్తుంది.. నాడు చేసిన సర్వే కు నేడు కట్టిన పాలమూరు-డిండి పథకానికి సంబంధం లేదని,ఇది కొత్త ప్రాజెక్ట్ అని .. విభజన చట్టం ప్రకారం అనుమతి లేదని ఆంధ్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
డిండి ఎత్తిపోతల పథకం కోసం వైయస్ఆర్ 2007లో ఇచ్చిన జీవో 159కి ,తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 107 కు కూడా సంబంధం లేదని ఆంధ్రప్రభుత్వం వాదించింది.
ఈ సమావేశంలోనే నీరు ఎంత వాడుకున్నారో తెలుసుకోవటానికి “టెలిమెట్రీ”లు ఏర్పాటు చేయటానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు దాదాపు అన్ని కాలువల మీద టెలిమెట్రీ యంత్రాలు అమర్చారు.
నాడు ఏమి ఒప్పందం చేసుకున్నారు?
2015 జూన్ 18న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమక్షంలో ఆంధ్రా 512,తెలంగాణ 299 టిఎంసిలు వాడుకునేలా ఒప్పందం జరిగింది. వరదగా వచ్చే అదనపు నీటిని అదే నిష్పత్తిలో అంటే 63:37 నిష్పత్తిలో పంచుకోవాలని అంగీకారానికి వచ్చాయి. అయితే అది కేవలం ఒక సంవత్సరానికి అనుకున్నారు కానీ పునఃసమీక్ష జరగలేదు.కాల పరిమితి ఎలా ఉన్నా అంగీకరించిన అంశాలలో సహజ న్యాయం ఉంది.. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చిన ఇంతకన్నా భిన్నమైన పంపకాలు జరగవు.
తెలంగాణా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్లు తెలంగాణాకు నష్టం లేదన్న నిజాన్ని నేడు కాకున్నా భవిష్యత్తులో తెలుసుకుంటారు. ఈ తెలంగాణా ప్రతిపక్షాలు ఎప్పుడన్నా “పాలమూరు-రంగా రెడ్డి” పథకాన్ని అభినందించారా? ఆ ప్రాజెక్ట్ ద్వారా కానీ,జూరాల కుడి కాలువ కింద ఉప కాలువల అభివృద్ధి ద్వారా కానీ నీటిని అందించిన కేసీఆర్ ను ఒక్కసారన్నా పొగిడారా? నాడు పాలమూరు-రంగారెడ్డి పథకం మీద చేసిన విమర్శలకు ,నేడు పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపును విమర్శించటానికి తేడా ఏమి లేదు.. కేవలం రాజకీయం మాత్రమే ఇందులో ఉంది.
పరిష్కారం ఎలా?
కేసీఆర్ అన్నట్లు మాట్లాడుకుంటే మంచిదే.. స్నేహసంబంధాలలో మాట్లాడుకోవటం వేరు అనుమతి కోరటం వేరు.
2015 & 2016లో పాలమూరు-రంగారెడ్డి,డిండి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఏమి చెప్పారో ఇప్పుడు జగన్ కూడా అదే విధంగా భావించి ఉండవచ్చు. కేసీఆర్ అభ్యంతరాలు చూసిన తరువాత జగన్ స్నేహపూర్వకంగా కేసీఆర్ కు ఫోన్ చెయ్యొచ్చు కానీ అపెక్స్ కౌన్సిల్ వరకు వెళ్లకుండా ఆంధ్రా ప్రజల అభీష్టాన్ని,సీమ వాసుల నీటి దాహాన్ని కేసీఆర్ అర్ధం చేసుకోవాలని విజ్ణప్తి .
రాజకీయ కారణాలతో అపెక్స్ కౌన్సిల్ వరకు వెళితే 2015 నుంచి ఉన్న వివాదాలకు ఇది కూడా జత అవుతుంది…పరిష్కారం వచ్చినప్పుడు అన్నిటికి వస్తుంది…అటు తెలంగాణాకు ఇటు సీమకు నీరు పారటం మాత్రం ఆగదు .
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన రోజు కేసీఆర్ అన్నట్లు.. అనుమతులు వొచ్చేప్పుడే వొస్తాయి అప్పటి వరకు నీటిని సముద్రంపాలు కానీయకూడదు,భూమిని బీడు కావొద్దు,జనం గొంతు తడి ఆరొద్దు …