iDreamPost
android-app
ios-app

కరోనా ఐసోలేషన్‌ వార్డులుగా రైలు బోగీలు..

కరోనా ఐసోలేషన్‌ వార్డులుగా రైలు బోగీలు..

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు ముందస్తుగా అనేక క్వారంటైన్‌ పడకలను, ఐసోలేషన్‌ పడకలను సన్నద్ధం చేసుకుంటున్నాయి. ఇబ్బందులు ఉన్న చోట్ల రైల్వే సేవలను ఉపయోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు రైలు బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకు రైల్వే శాఖ కూడా అనుమతి తెలిపింది.

రైల్వే బోగీలను ఐసోలేషన్‌ పడకలకు అనుకూలంగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు వర్క్‌షాపుల్లో ఉన్న రైలు బోగీల్లో కరోనా రోగుల కోసం ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని చోట్లా ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే పంజాబ్‌లోని కపుర్తల రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఐసోలేషన్‌ పడకలకు డిజైన్లు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కోల్‌కతా కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే బోగీల్లో క్వారంటైన్‌ సదుపాయాలు కల్పించారు.

బోగీలోని ఒక్కో సెక్షన్‌లో ఒక వైపు మధ్యలో ఉన్న బెడ్‌ను తొలగిస్తారు. ఎదురుగా ఉండే మూడు బెర్త్‌లను తొలగిస్తారు. పైకి ఎక్కడానికి ఉండే ఏర్పాట్లను కూడా తీసేస్తారు. బోగీ చివరన వైద్యులు, నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక రూమ్‌ కేటాయిస్తారు. బాత్‌రూమ్‌లను కూడా పేషంట్లకు అనుగుణంగా మార్చుతారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేటల్లో కోచ్‌ ప్యాక్టరీలు ఉన్నాయి. రాయనపాడు, తిరుపతిలో వర్క్‌షాపులున్నాయి. ఈస్ట్‌కోస్ట్‌ పరిధిలో విశాఖ వద్ద వర్క్‌షాపుఉంది. వీటిలో గల అవకాశాలపై రైల్వే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో రైల్వే బోగీలను కరోనా వార్డులుగా మార్చనున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను, క్రీడా మైదాలను ఉపయోగించకోవచ్చని రైల్వే అధికారులు తెలిపిన విషయం తెలిసిందే.