iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచే ప్రజా రవాణా అందుబాటులోకి రానున్నది. దాదాపు అరవై రోజుల తరువాత ఆర్టీసి బస్సులు రోడ్డుపై రైట్ రైట్ అంటూ ముందుకు సాగనున్నాయి. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కట్టడికి కేంద్రద ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు రేపటి (గురువారం) నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారినీ, బస్టాండుకు వచ్చి గ్రౌండ్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకున్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తారు. నగదు ద్వారా కొవిడ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కండక్టర్ బస్సులో ఉండకుండా ఈ విధానం అమల్లోకి తీసుకోచ్చే విధంగా రవాణా శాఖ చర్యలు చేపట్టింది.
సిఎం జగన్ సమావేశం
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఆర్టీసి ఎండి మాదిరెడ్డి ప్రతాప్, టాస్క్‌ఫోర్స్ ఉన్నతాధికారులు సమావేశమై ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. బస్సుల్లో సీటింగ్ మార్పు, గ్రీన్, ఆరెంజ్ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్ జోన్లలో పాటించే నిబంధనలు, బస్సులు తిరగడం వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 128 బస్ డిపోలు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని డిపోల నుంచి సాధ్యమైనన్ని బస్సులు నడపాలని అధికారులు భావించారు. అందుకు అనుగుణంగా అంతా సిద్ధం అయ్యింది.
చార్జీల్లో ఎలాంటి పెంపు లేదు..పాత రేట్లే..
చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సిఎం జగన్ చెప్పడంతో అధికారులు సరేనన్నారు. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు అప్పుడే తిరగవు. మరికొన్ని రోజులు పాటు ఆపితే మంచిదని భావించారు. ఎందుకంటే దేశంలో కరోనా వ్యాప్తి పట్టణాల్లోనే ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో బస్సులు మరి కొన్ని రోజులు ఆపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశముందని సిఎం జగన్ భావించినట్లు సమాచారం.
అందుబాటులోకి వీలైనన్ని ఎక్కువ బస్సులు
డిపోల్లో కొన్ని బస్సులకే సీటింగ్ విధానం మార్చడం వల్ల వీలైనంత మేరకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, ఆర్టీసీ బస్సులు తిప్పడంపై నేడు ఆర్టీసి ఎండి మాదిరెడ్డి ప్రతాప్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
కేంద్ర మార్గదర్శకాల్లో ప్రజా రవాణాకు అనుమతి
ఇటీవలి లాక్‌డౌన్ 3.0 పూర్తి అయిన తరువాత, లాక్‌డౌన్ 4.0 అమలకు కేంద్ర హో మంత్రిత్వ శాఖ విడుదల మార్గదర్శకాల్లో రాష్ట్రాల్లో ప్రజా రవాణాకు షరతులతో కూడిన అనుమతిచ్చింది. వాస్తవానికి లాక్‌డౌన్ 3.0 మధ్యలోనే గ్రీన్ జోన్‌ల్లో ప్రజా రవాణాకు అనుమతి వచ్చింది. అయితే రాష్ట్రాలు మాత్రం బస్సులు తిప్పలేదు. లాక్‌డౌన్ 4.0లో మాత్రం అన్ని జోనుల్లో ప్రజా రవాణాకు అనుమతి వచ్చింది. బస్సులు తిప్పుకునేందుకు అనుమతి లభించడంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. దీంతో ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా కూడా ప్రజా రవాణా అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయాలు తీసుకున్నాయి.
అంతెందుకు దేశంలోనే కరోనా ప్రవాహం ఉధృతంగా ఉన్న మహారాష్ట్రలో కూడా ప్రజా రవాణా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అంతే కాదు ఎక్కువ కేసులు నమోదు అవుతున్న గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కూడా బస్సులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో బస్సులు తిరుగుతున్నాయి. ఇక తెలంగాణలో రెడ్ జోన్‌గా ఉండే హైదరాబాద్ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్‌లో కూడా సిటి బస్సులు మాత్రమే తిరగవు. ఇతర జిల్లాల నుంచి రాకపోకలకు బస్సులు అందుబాటులో ఉంటాయని సిఎం కెసిఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి అనుమతించకుండా బస్సులు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.