iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ పెద్దల చర్చలు – ఫలితమేంటో

  • Published Sep 20, 2021 | 12:06 PM Updated Updated Sep 20, 2021 | 12:06 PM
టాలీవుడ్ పెద్దల చర్చలు – ఫలితమేంటో

ఇవాళ టాలీవుడ్ పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నానితో జరిగిన చర్చలు పూర్తయ్యాయి. కొన్ని కీలకమైన అంశాలు డిస్కస్ చేసినట్టు తెలిసింది. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది ఇండస్ట్రీలోనూ చర్చకు దారి తీసింది. 200 కోట్లని 600 కోట్లని పోస్టర్లలో కలెక్షన్లను పబ్లిసిటీ చేయడం సహజమేనని, అంత మాత్రాన అవి నిజంగా వచ్చినట్టు భావించకూడదని చెప్పి షాక్ ఇచ్చారు. అలా కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే సాధ్యమవుతాయని, జాతిరత్నాలు లాగా తక్కువ బడ్జెట్ తో ఎక్కువ వసూళ్లు అన్ని చిత్రాలు చేయలేవని నొక్కి చెప్పడం గమనార్హం.

ఫేక్ కలెక్షన్లు కేవలం పబ్లిక్ ని సినిమా చూసేలా ఆకర్షించటం కోసం తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పేశారు. ఇటీవలే పేర్ని నాని 2020 సంక్రాంతికి వచ్చిన రెండు భారీ సినిమాల వసూళ్ల గురించి చేసిన కామెంట్లకు బదులుగా కళ్యాణ్ ఇలా చెప్పడం ట్విస్ట్. ఇక ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం పట్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తరఫున ప్రతినిధులు సానూకూలంగానే తమ స్పందనను తెలియజేశారట. ఇలా చేస్తే ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు కూడా కరెక్ట్ గా వస్తాయనే రీతిలో పేర్కొన్నారట. మీటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రేపటికి ఒక క్లారిటీ రావొచ్చు.

ఇప్పుడీ సమావేశం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఫేక్ కలెక్షన్లని ఒక నిర్మాతే స్వయంగా చెప్పడం ఈజీగా కొట్టిపారేయాల్సిన అంశం కాదు. నిన్న చిరంజీవి లవ్ స్టోరీ ఈవెంట్ లో విన్నపాలు చేసి ఇరవై నాలుగు గంటలు కాకముందే ఇప్పుడీ అప్ డేట్స్ రావడం మరో మలుపు. 24న విడుదల కాబోతున్న లవ్ స్టోరీ నుంచి మినహాయింపులు ఏమైనా ఉంటాయా అనేది పరిశ్రమ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. టికెట్ రేట్లకు సంబంధించి ఎలాంటి మార్పులు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. కలెక్షన్ల సంగతి సరే మరి ఆకాశమే హద్దుగా పెంచుకుంటూ పోతున్న హీరోల రెమ్యునరేషన్ల గురించి ఏమైనా మాట్లాడారాని నెటిజెన్లు ఆ వీడియోకు కామెంట్లు పెట్టడం ఫైనల్ ట్విస్ట్

Also Read : OTTలోనూ గేమ్ ఆడిస్తారా బాస్