Idream media
Idream media
దేశవ్యాప్తంగా మరో సారి లాక్ డౌన్ పొడిగించడం తో ప్రధాని నరేంద్ర మోడీ రేపు ప్రజల ముందుకు రానున్నారు. జాతినుద్దేశించి రేపు శనివారం ఉదయం 10 గంటలకు ప్రసంగించనున్నారు. ఎల్లుండి ఆదివారం తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రేపు లేదా ముగిసే రోజైన మే 3వ తేదీన ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడిగింపు పై ప్రకటన చేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఐతే ఈ రోజు శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ పొడిగింపుపై అధికారిక ప్రకటన చేసింది. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని పేర్కొన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మే 17 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
దాదాపు 40 రోజుల పాటు కొనసాగిన లాగడంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా ఆపత్కాలంలో ఇప్పటి వరకు మూడు సార్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. రేపు నాలుగోసారి ప్రధాని మోదీ దేశ ప్రజల ముందుకు వస్తున్నారు.
లాక్ డౌన్ వల్ల అన్ని కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయి కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి ప్రధాని మోదీ ప్రకటన చేస్తారన్న ఆశతో వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలు ఉన్నాయి. ఈ అంశంపై ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా ఉద్దీపన చర్యలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోమారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్దీపన చర్యలు, ఆర్ధిక ప్యాకేజీ ప్రకటన వస్తుందని కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లాక్ డౌన్ కారణంగా ఆదాయం పూర్తిగా తగ్గిపోయి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న తమను ఆర్థికంగా ఆదుకోవాలి అంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు, పారిశ్రామిక రంగానికి రాయితీలు ఇవ్వాలని కోరాయి. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామిక వర్గాలకు ఉరటనిచ్చేలా ప్రధాని ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి.