iDreamPost
android-app
ios-app

కరోనాపై వ్యూహకర్త అంచనా నిజమేనా..? అయితే కష్టకాలమే..!

కరోనాపై వ్యూహకర్త అంచనా నిజమేనా..? అయితే కష్టకాలమే..!

కరోనా వైరస్‌ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నింటి కంటే వైరస్‌ వ్యాప్తి ప్రారంభ దశలోనే భారత్‌ లాక్‌డౌన్‌ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపైనే పూర్తిగా దృష్టి సారించాయి. ఓ పక్క కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు లాక్‌డౌన్‌ కాలంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలకు ఆపన్న హస్తాలు అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వ చర్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని పీకే వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన పరీక్షలు గానీ, చికిత్స సదుపాయాలు గానీ కేంద్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందని మండిపడ్డ ఆయన ఓ ఉదహారణను గణాంక రూపంలో వ్యక్తం చేశారు. ప్రతి పది లక్షల మందికిలో కేవలం పది మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని పీకే అంచనా వేశారు.

పీకే ఏ సమాచారంతో చెప్పారో గానీ భారత్‌లో అలాంటి పరిస్థితి ఉంటే దేశం క్లిష్టదశలో ఉన్నట్లేనని భావించవచ్చు. లాక్‌డౌన్‌ చేసిన తర్వాత కూడా భారత్‌లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత వెయ్యి దాటాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో అందరినీ క్వారంటైన్‌ చేయలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఏపీలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ ఇతర రాష్ట్రాల్లో లేకపోవడంతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం కష్టసాధ్యమవుతోంది. ఈ పరిస్థితిలోనే పీకే పై వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చా..? లేదంటే రాజకీయ వైరంలో భాగంగా మోదీ, బీజేపీపై ఉన్న కోపంతో ఈ వ్యాఖ్యలు చేశారా..? రాజకీయ విమర్శల్లో భాగమనుకుని పీకే వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుంటే కరోనా మహమ్మరి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవ పరిస్థితి పీకే చెప్పినట్లే ఉంటే మాత్రం భారత్‌కు కష్టకాలం తప్పదు.