Idream media
Idream media
ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా..! సీఎంను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్‌కి ఒక్క రోజు సీఎంగా పని చేసి చూడు అనే ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన జర్నలిస్ట్ పాత్రలో ఉన్న సినీ హీరో అర్జున్ ఒక్క రోజులో ఏమి చేయగలమో చేసి చూపించారు. సినిమాల్లోనే లభించే ఇలాంటి ఆఫర్లు వాస్తవంగా కూడా వస్తే ఎలా ఉంటుంది..? అచ్చం ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ సీఎం పదవి బదులు కలెక్టర్ పదవి. అంతే తేడా. సీఎం రాష్ట్రాన్ని పాలిస్తే.. కలెక్టర్ జిల్లాను పాలిస్తారు.
ఒకే ఒక్కడు రిల్ సినిమాను ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రియల్ లైఫ్‌లో వ్యాపారులకు చూపించారు. ‘సార్..కొవిడ్ కట్టడి చర్యలతో మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. కొంత సడలింపులను ఇవ్వండి’ అని వ్యాపారులు కోరారు. ఇలా అడిగిన వ్యాపారులకు కలెక్టర్ పోలా భాస్కర్ ఏకంగా ‘ ఒకే ఒక్కడు సినిమా’ చూపించారు. ‘ఎవరికైనా ఆసక్తి ఉంటే రండి. నా కన్నా బాగా పని చేయగలమని మీరు అనుకొంటే.. ఒకరోజు కలెక్టర్‌గా పనిచేయడానికి అవకాశమిస్తాను. మీరేం చేస్తారో చూద్దాం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊహించని విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో వ్యాపారులు విస్తుపోయారు.
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కరోనా ఆంక్షలు ఎత్తి వేయాలని వ్యాపారులు కొంతకాలంగా కోరుతున్నారు. సోమవారం పలువురు వ్యాపారులతో కలెక్టర్ పోలా భాస్కర్ ఈ సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా ఓ వ్యాపారి కొవిడ్ కట్టడి చర్యల కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ ప్రతిస్పందిస్తూ…ఇది సినిమా కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా తాను ముందుకు వెళ్లాల్సి ఉందని స్పష్టం చేశారు .