ఆది పురుష్ సందేహాలు తీరినట్టేనా?

నెలలు రోజుల్లా కరిగిపోతున్న ట్రెండ్ లో ప్రభాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఆది పురుష్ కేవలం ఇంకో 95 రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. టీజర్ లో వాడిన గ్రాఫిక్స్ మీద విపరీతమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో అలెర్ట్ అయిన టీమ్ నిన్న హైదరాబాద్ ఏఎంబి మాల్ లో ప్రత్యేకంగా త్రీడి వెర్షన్ ని మీడియాకు ప్రదర్శించారు. అతిధిగా వచ్చిన దిల్ రాజుతో పాటు యూనిట్ సభ్యులందరూ కంటెంట్ మీద గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడి తీసిన ఆది పురుష్ కు ఆ విషయం ముందు నుంచి గుట్టుగా ఉంచడం వల్లే ఈ ఇబ్బంది వచ్చింది. లేకపోతే కేవలం వంద రోజుల్లో ఇంత పెద్ద క్యాస్టింగ్ తో ఇలాంటి సినిమా తీయడం అసాధ్యం.

సరే ఇక్కడితో ఆది పురుష్ మీద ఉన్న సందేహాలకు చెక్ పడినట్టేనా అంటే పూర్తిగా ఎస్ అని చెప్పలేం. ఇంకా ట్రైలర్ రావాలి. మరోవైపు వివాదాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హనుమంతుడు, రావణుడి గెటప్స్ కి సంబంధించి పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాముడి కథను విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో విచిత్రంగా చూపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు ఏకంగా కోర్టుకు వెళ్లేందుకు సైతం రెడీ అవుతున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఇది మొబైల్ ఫోన్ కోసం తీసిన సినిమా కాదని సమర్ధించుకోవడం ఇప్పటికే సోషల్ మీడియాలో రివర్స్ అయ్యింది. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ కూడా బిగ్ స్క్రీన్ కోసమే తీశారని కానీ అవి ఫోన్లలో కూడా గొప్పగా కనిపిస్తాయని కౌంటర్లు వచ్చి పడ్డాయి.

ఈ లెక్కన సగం నిజం సగం యానిమేషన్ గా నడిచే ఆది పురుష్ ని ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అసలే 2023 సంక్రాంతికి విజయ్ వారసుడుతో పాటు చిరంజీవి వాల్తేర్ వీరయ్యలు బరిలో ఉంటాయి. ప్యాన్ ఇండియా స్థాయిలో వాటితో పోటీ ఉండదు కానీ తెలుగు తమిళ మార్కెట్లకు సంబంధించి అంత తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఆది పురుష్ లో సైఫ్ అలీ ఖాన్ దశకంఠుడిగా విలన్ వేషం వేసిన సంగతి తెలిసిందే. ఇంత నెగిటివిటీ మధ్య సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్ల తాలూకు గాయాలను పూర్తిగా మాసిపోయేలా ఈ ఆది పురుష్ చేస్తుందో లేదో వేచి చూడాలి

Show comments