iDreamPost
android-app
ios-app

వైఎస్సార్‌సీపీలోకి పోతుల సునీత… కండువా కప్పిన వైఎస్‌ జగన్‌

  • Published Jan 23, 2020 | 3:07 PM Updated Updated Jan 23, 2020 | 3:07 PM
వైఎస్సార్‌సీపీలోకి పోతుల సునీత… కండువా కప్పిన వైఎస్‌ జగన్‌

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ రోజు సాయంత్రం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆమె కలిశారు. ఆమెకు పార్టీ కండువా కప్పిన వైఎస్‌ జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాలు బాగున్నాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ఉన్నాయి. అందుకే మూడు రాజధానులపై అనుకూలంగా ఓటు వేశాను.. అని చెప్పుకొచ్చారు.

ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే రాజీనామా చేసిన తర్వాత మాత్రమే పార్టీలోకి తీసుకుంటామని సీఎం జగన్‌ నిబంధన పెట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో.. టీడీపీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్ధాలి గిరి వైఎస్సార్‌సీపీలో చేరలేకపోయారు. కానీ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని.. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. అయితే పోతుల సునీతకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పడంతో ఆమె తన పదవికి రాజీనామా చేసినట్లుగానే భావించవచ్చు. శాసన మండలి రద్దు పై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న సమయంలో సునీత వైఎస్సార్‌సీపీలో చేరడం గమనార్హం.

పోతుల సునీత అంటే 2014 వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పటికి కూడా ఆమె పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుడు పోతుల సురేష్‌ సతీమణిగానే సుపరిచితురాలు. 2014లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీ పదవి పొందారు. 2019లో చీరాల సీటు సునీతకు దక్కలేదు. టీడీపీ సీనియర్‌ నేత కరణం బలరామకృష్ణమూర్తికి ఇచ్చారు. అప్పటి నుంచి పోతుల సునీత అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఆమె మొన్న జరిగిన శాసన మండలిలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓటు వేశారని చెప్పవచ్చు.

ఇదీ చరిత్ర…

అయితే పోతుల సురేష్ అస‌లు పేరు బ‌లిసెట్ల వెంక‌టరామ‌య్య‌. ఇది ఎవ్వ‌రికీ తెలియ‌ని పేరు. క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గం ప్యాపిలి మండ‌లం నేరేడుచ‌ర్ల గ్రామం. ఆయ‌న త‌ల్లిది పాల‌మూరు జిల్లా అల్లంపూర్ తాలుకా ఇటిక్యాల మండ‌లంలోని వావిలాల గ్రామం. అయితే త‌న జీవితంమొత్తం అనంత‌పురం జిల్లాలోనే సాగ‌డంతో ఆయ‌న‌ది అనంత‌పురం జిల్లాగానే అంద‌రూ చెప్పుకుంటారు. అడ‌వుల్లో ఆయ‌న ఉద్య‌మ బాట‌లో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న మిత్రుడైన పోతుల సుద‌ర్శ‌న్ మృతిచెందారు. అయితే అప్ప‌టికే బ‌లిసెట్ట వెంక‌ట‌రామ‌య్య కాస్త సురేష్‌గా పిలువ‌బ‌డేవాడు. ఇక త‌న మిత్రుడు చ‌నిపోయాన ఆయ‌న జ్ఞాప‌కార్తం పోతుల సురేష్‌గా పేరును మార్చుకున్నారు. దీంతో ఆయ‌న పోతుల సురేష్‌గానే అంద‌రికీ తెలుసు.

అయితే పోతుల సురేష్ లాగానే పోతుల సునీత కూడా ఉద్య‌మంలో ప‌నిచేసి 1999లో జ‌నంలోకి వ‌చ్చేశారు. 2001లో పాల‌మూరు జిల్లా ఇటిక్యాల జెడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. అయితే అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌లో కొన‌సాగుతున్న పోతుల సునీత 2003లో త‌న భ‌ర్త పోతుల సురేష్‌ను అప్ప‌టి హోమంత్రి దేవేంద్ర గౌడ్ స‌మ‌క్షంలో జ‌నంలోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆయ‌న అనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కొన‌సాగారు. ప‌రిటాల ర‌వి ముఖ్య అనుచ‌రుడుగా ఓ వెలుగు వెలిగారు. అయితే అప్ప‌ట్లో జ‌రిగిన ప‌లు రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో నేప‌థ్యంలో 2010 వ‌ర‌కు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత 2014లో పోతుల సునీత చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా వెలుగులోకి వచ్చారు.