iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ లో ఏ సమయంలోనయినా రాజకీయాలు ఆసక్తిగా ఉంటాయి. ప్రపంచం స్తంభించిన తర్వాత లాక్ డౌన్ లో కూడా అలాంటి వ్యవహారమే సాగుతోంది. కరోనా చుట్టూ విపక్షం రాజకీయాలకు ప్రయత్నించడం తగదని పాలకపక్షం అంటోంది. కానీ ప్రతిపక్షం మాత్రం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద గురిపెట్టినట్టు కనిపిస్తోంది. వాలంటీర్ల సర్వీస్ సక్సెస్ అయితే దాని క్రెడిట్ మొత్తం జగన్ కే దక్కుతుందని విపక్షం భావిస్తున్నట్టుంది. అందుకు తగ్గట్టుగానే వాలంటీర్ల వైఫల్యం అంటూ విమర్శలకు దిగుతోంది. అదే సమయంలో అధికార వైఎస్సార్సీపీ కూడా వాలంటీర్ల వ్యవస్థను కేరళ, బ్రిటన్ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయని, తద్వారా జగన్ దార్శనికతకు ఈ వ్యవస్థ అద్దంపడుతోందని ప్రచారం చేసుకుంటోంది. దాంతో ఇరు పార్టీలు కేంద్రీకరించిన వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఏపీలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన పాలనా మార్పులలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ ఉద్భవించిన సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది ఆగష్ట్ లో పురుడుపోసుకున్న ఈ విధానం ద్వారా ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున గ్రామ లేదా వార్డు వాలంటీర్ గా నియమించబడ్డారు. వారి ద్వారా ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద స్థాయిలో నిర్వహించి పలువురిని ఆకట్టుకున్నారు. లబ్దిదారుడు ఎక్కడ ఉంటే అక్కడికే తీసుకెళ్లి పెన్షన్లు అందించిన విధానం పై ప్రశంసలు వచ్చాయి. ఇక ఏప్రిల్ నుంచి రేషన్ కూడా ఇంటింటికీ అందిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణ లో సాధ్యం చేయలేకపోయారు.
కరోనా కలకలం నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ పనితీరు బాగా ఉపయోగపడినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితి, ఇతరుల ఆరోగ్య సమస్యలు వంటివి సంపూర్ణంగా సేకరించడానికి తోడ్పడ్డారు. ఎప్పటికప్పుడు వారి వివరాలను ప్రభుత్వానికి చేర్చడంలో కీలక భూమికి పోషించారు. తద్వారా వాలంటీర్ల వ్యవస్థ కారణంగా ఏపీలో కరోనా వ్యాప్తిని ఏదో మేరకు అడ్డుకోవడానికి దోహదపడిందనే అభిప్రాయానికి ప్రభుత్వ లెక్కలు ఉదాహరణగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను పలువురు అభినందిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షానికి ఇది మింగుడుపడని అంశంగా మారింది.
సహజంగానే రాజకీయాలు ప్రధాన పాత్ర పోషించే రాష్ట్రంలో ఇప్పుడు వాలంటీర్ల విధానం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావడం టీడీపీ నేతలకు జీర్ణం కాని అంశంగా మారింది. దానికి తగ్గట్టుగానే ఎక్కడయినా దొర్లే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపడం ద్వారా తన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆంధ్రజ్యోతి పత్రికలో రేషన్ పంపిణీపై రాసిన రాతలు అందులో భాగమే. వాలంటీర్ల వైఫల్యం అంటూ చిత్రీకరించే ప్రయత్నం సాగింది. తద్వారా ప్రభుత్వం తాము సక్సెస్ సాధించామని చెప్పుకుంటున్న అంశంలో విఫలమయ్యారనడానికి ఉదాహరణలుగా చూపించే యత్నం చేసింది. అదే సమయంలో టీడీపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. మొత్తంగా రెండు ప్రధాన పక్షాలు వాలంటీర్ల పనితీరు మీద గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రయోజనకరమైన రీతిలో కనిపించిన ఈ విధానం రాబోయే రోజుల్లో ప్రభుత్వ కీర్తి పెంచుతుందా లేదా తలవంపులకు కారణం అవుతుందా అన్నది పెద్ద సంఖ్యలో ఉన్న వాలంటీర్లను వినియోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.